ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న పుస్తక శాలలు
నిరుద్యోగులకు అందుబాటులో అవసరమైన పుస్తకాలు
సకల సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);సమాజాన్ని చైతన్యపరిచే దీపశిఖలు.. విద్యార్థుల విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు.. ఇవీ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న భవనాలు, పెంకులూడే పైకప్పులు, చదువుకోవడానికి కనీస సౌకర్యాలు లేని పఠన మందిరాలకు స్వరాష్ట్రంలో మహర్దశ పట్టుకుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కోట్లు వెచ్చించడంతో కొత్త భవనాలు అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటుండగా.. పాఠకులకు అవసరమైన బుక్స్ కూడా తెప్పిస్తున్నారు. సకల సౌకర్యాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో పఠన మందిరాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. శిథిలావస్థకు చేరిన భవనాలు, పాత పుస్తకాలు, వసతుల కొరత లాంటి సమస్యల కారణంగా పాఠకులు గ్రంథాలయాలకు పోవడానికి ఇష్టపడేవారు కాదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం లైబ్రరీలకు పెద్దపీట వేసింది. కొత్తగా భవనాలను నిర్మించడంతో పాటు స్థానికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. అన్ని హంగులతో నిర్మల్, చెన్నూర్‌లో కొత్త భవనాలను నిర్మించగా ఆసిఫాబాద్‌లో నిర్మించనున్నారు.
కొత్తగా నిర్మించిన భవనాల్లో పేపర్ సెక్షన్, బుక్ సెక్షన్, రీడింగ్ హాల్, కంప్యూటర్ సెక్షన్ గదులు ఉన్నాయి. ఏసీ, వైఫై లాంటి సౌకర్యాలూ కల్పించారు. దీంతో డిజిటల్ పాఠాలు చదువుకునే అవకాశం లభిస్తున్నది. ఫర్నీచర్ సైతం కొనుగోలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాత పుస్తకాలు మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండగా, ఇప్పుడు లైబ్రరీలకు వచ్చే వారు కోరుకున్న పుస్తకాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఇందుకోసం ఆన్ డిమాండ్ బుక్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో రిజిష్టర్‌లో పాఠకులు, నిరుద్యోగులు తమకు అవసరమైన పుస్తకం పేరు రాస్తే అధికారులు వాటిని మార్కెట్లో కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతారు.
నిరుద్యోగులకు వరంగా
ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వేల రూపాయలు ఖర్చు చేసి ఉద్యోగాల శిక్షణ పొందలేని వారికి గ్రంథాలయాలకు వరంగా మారాయి. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లైబ్రరీల్లో ఉండడంతో వారు రోజు గ్రంథాలయాలకు వచ్చి చదువుకుంటున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాత పేపర్లు, ఇతర పుస్తకాలు ఉంటున్నాయి. తమకు అవసరమైన పుస్తకాలు స్థానికంగా లభిస్తుండడంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. పరిసరాల్లో గ్రీనరీతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. నిర్మల్ గ్రంథాలయంలో నిత్యం 80 మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. ఇక్కడ చదువుకున్న 30 మందికి పోలీస్, పంచాయతీ సెక్రటరీ లాంటి ఉద్యోగాలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. గ్రంథాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై విద్యార్థులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అవసరమైన పుస్తకాలు తెస్తున్నారు
నేను నా స్నేహితునితో కలిసి నిత్యం లైబ్రరీకి వస్తున్న. దాదాపు 8 గంటల పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాం. జనరల్ ఇంగ్లిష్, ఇండియన్ పొలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ చరిత్ర, యోజనతో పాటు ఇతర పుస్తకాలు చదువుతున్న. ఇక్కడే చదువుకున్న నా స్నేహితునికి వీఆర్ఏ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాల ప్రిపరేషన్లో భాగంగా మాకు అవసరమైన పుస్తకాలు రాసి ఇస్తే సిబ్బంది తీసుకు వస్తున్నారు. చదువుకునేందుకు అహ్లాదకరమైన వాతావరణ ఉంది. మాకు సిబ్బంది సైతం ఎంతో సహకారం అందిస్తున్నారు.
– ఎం ప్రణయ్, నిర్మల్
నిత్యం 8 గంటలు చదువుతున్న
నేను బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. ఏడాది నుంచి లైబ్రరీకి వచ్చి వివిధ పోటీ పరీక్షలు పుస్తకాలు చదువుతున్న. ప్రిపరేషన్లో భాగంగా రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు లైబ్రరీలోనే ఉంటున్న. గతంలో ఉద్యోగాలు సంపాదించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ప్రిపేర్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానికంగా ఉంటే గ్రంథాలయాల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాల కల్పించి చదువుకునే అవకాశం కల్పించింది. ఇక్కడ చదువుకున్న నా స్నేహితునికి పోలీసు ఉద్యోగం వచ్చింది.
–జీ సుధీర్, విద్యార్థి, నిర్మల్
సంతోషంగా ఉంది
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమైయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయాలను సిద్ధం చేస్తుండటంతో చాల సంతోషంగా ఉంది. గ్రంధాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నందున వేలకు వేలు ఖర్చు చేసి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం వెల్లే వారికి అవి ఎంత గానో ఉపయోగపడుతున్నాయి. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న నిరుద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
–వేయిగండ్ల శ్రీనివాస్, చెన్నూర్