నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు కూడా మూతపడనున్నాయి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన
చెందుతున్నారు. ఎప్పుడిస్తారో కూడా తెలియకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.
నిర్మల్, జూన్ 6(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 260 కొనుగోలు కేంద్రా ల ద్వారా ధాన్నాన్ని కొనుగోలు చేశారు. ఇందులో నుంచి 171 సెంటర్లను ఇప్పటికే మూసేశారు. సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు బోనస్ డబ్బులు అందలేదు. ధాన్యం డబ్బులు వారం, పది రోజుల్లో
రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ బోనస్ డబ్బుల కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్‌కు సంబంధించి 25 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లను కొన్నారు. సన్నాలపై ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ
మేరకు జిల్లా రైతులకు రూ.12.50 కోట్లను చెల్లించాల్సి ఉన్నది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ చెల్లింపుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందుకు సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయకపోవడంతో ఈ సారి రైతులకు బోనస్ కూడా అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 1,17,085 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ సీజన్లో 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 1.38లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం వడ్లు, 24వేల మెట్రిక్ టన్నులు సన్నరకం వడ్ల దిగుబడులు వస్తాయని పంటల ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో నుంచి కొంతవరకు స్థానిక అవసరాలకు పోను 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందుకనుగుణంగా జిల్లాలో మొత్తం 330 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇందులో ఐకేపీ సెంటర్లు 171, పీఏసీఎస్ కేంద్రాలు 147, డీసీఎంఎస్ 7, జీసీసీ ఆధ్వర్యంలో 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాని కొనుగోళ్లు మాత్రం 260 కేంద్రాల ద్వారా చేపట్టారు. వీటిలో 131 ఐకేపీ సెంటర్లు, 112 పీఏసీఎస్, డీసీఎంఎస్ 13, జీసీసీ 4 కేంద్రాలు ఉన్నాయి. కాగా ఈ యాసంగి ధాన్యం సేకరణ మొత్తం లక్ష్యం 1,62,414 మెట్రిక్ టన్నులు కాగా ఈ సారి లక్ష్యానికి మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,76,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఇందులో దొడ్డురకం 1,51,000 మెట్రిక్ టన్నులు కాగా, సన్నరకం 25 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్నది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వరి కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయి. ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, తదితర మండలాల్లో వరి కోతలు ఆలస్యం కావడంతో ఆయా మండలాల్లో మాత్రమే కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 38,841 మంది రైతులకు రూ.267 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.202 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా దాదాపు రూ.67 కోట్ల వరకు ధాన్యం డబ్బులను రైతులకు చెల్లించాల్సి ఉన్నది. వీటితో పాటు సన్నాలు విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన రూ.12.50 కోట్ల బోనస్ డబ్బుల గురించి ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు.
నిర్మల్ జిల్లాలో కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి సంబంధించి 4,170 మంది రైతులకు రూ.12.50 కోట్లను రైతులకు బోనస్‌గా చెల్లించాల్సి ఉన్నది. ఈ బోనస్ చెల్లించాలని ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను తెలుపుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినప్పటికీ ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు
ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. జిల్లాలో ఇప్పటికీ రూ.267 కోట్ల విలువ చేసే దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో నుంచిరూ.202 కోట్ల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. కాని సన్నరకం ధాన్యానికి మాత్రం బోనస్ డబ్బులను చెల్లించక పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రుతుపవనాలు వచ్చి వానకాలం సాగు కోసం దుక్కులు దున్నుతున్న రైతులకు బోనస్ డబ్బులు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వానకాలంలో పండించిన సన్నాలకు బోనస్ అందడంతో ఈసారి కూడా బోనస్ డబ్బులు వస్తాయని రైతులు గంపెడాశతో మండు వేసవిలో సైతం సన్న వడ్లను సాగు చేశారు. సాగు నీటి ఇబ్బందులను అధిగమించి కేవలం బోనస్ వస్తుందన్న ఆశతో ధైర్యం చేసి సన్నాలను సాగు చేసిన రైతులకు ప్రస్తుతం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని కోరుతున్నారు.
నాకున్న 6 ఎకరాల పొలంలో మూడున్నర ఎకరాల్లో సన్నరకం వడ్లు వేసిన. 75 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మిన. రూ.37వేల దాకా బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయితాయని చెప్పిన్రు. పంట అమ్మి దాదాపు నెల రోజులవుతున్నది. ఇప్పటి
వరకు బోనస్ డబ్బులు రాలే. యాసంగిలో సాగు నీటికి తిప్పలయినా, బోనస్ వస్తుందన్న ఆశతో కష్టపడి సన్నరకం వడ్లను పండించిన. ప్రతిసారి ఎదురుచూపులు తప్పడం లేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉన్నది. కష్టపడి పండించిన పంట పైసలే సక్కగా ఇస్తలేరు. ఇంక రైతుబంధు ఇస్తరో
ఇయ్యరో గ్యారెంటీ లేకుంటైంది.
-అశోక్, రైతు, సిద్ధాపూర్