ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. పల్లెలు, పట్టణాల్లో బోనాల సందడి కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ ఉత్సవాలతో ఊరూవాడా సందడిగా మారింది. కుటుంబసభ్యులు, బంధువుల రాకతో ఇల్లిల్లూ కళకళలాడుతున్నది. గ్రామదేవతలకు బోనం సమర్పించి, అందరినీ సల్లంగా చూడమని ప్రజానీకం వేడుకుంటున్నది. పూజలు, పోతరాజుల విన్యాసాలు, ఊరేగింపులతో గ్రామాల్లో సందడి నెలకొనగా, డప్పుచప్పుళ్ల మోతలు, బోనమెత్తిన మహిళల నృత్యాలతో సంబురం కనిపిస్తున్నది.
-నిర్మల్, జూలై 9(నమస్తే తెలంగాణ)
నిర్మల్, జూలై 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. యేటా ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి. ఈ పండుగ సీజన్లో పల్లెలు బంధువులతో కళకళలాడుతుంటాయి. జిల్లా కేం ద్రం బంగల్పేట్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. శాస్త్రీ నగర్లో ని మారెమ్మ ఆలయానికి ఏఎన్రెడ్డి కాలనీ, ఇంద్రానగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీలకు చెందిన వందలాది మంది మహిళలు ఊరేగింపుగా వెళ్లి, అమ్మవారికి బోనం సమర్పించారు. మొ క్కులు తీర్చుకున్నారు. కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల జాతరలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడి గజ్జలమ్మ తల్లి, మహాలక్ష్మి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసం తొలి ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా బోనాల సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాల్లోని గ్రామదేవతలకు బోనం సమర్పించారు.
బోనం సమర్పణ..
బోనం అంటే భోజనం. ప్రజలు గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యం. కొత్త కుండలో వండిన బోనం సమర్పించడం ఆనవాయితీ. చిన్న ముంతలో తయారు చేసిన పానకం సాకగా పోస్తారు. ముంతపై దివ్వె పెట్టి బోనం జ్యోతిని వెలిగిస్తారు. ఆ బోనాలను మహిళలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఊరేగింపుగా వెళ్లే సమయంలో బోనాలన్నీ వరుసగా వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. పండుగ రోజున మహిళలు తలస్నానం చేసి, మడితో బోనం వండుతారు. ఒక పాత్రలో అన్నం వండి, ఇతర వంటకాలు, ప్రసాదాలు తయారు చేస్తారు. పూర్తిస్థాయిలో బోనం తయారు చేసి, ఊరేగింపుగా తీసుకువెళ్లే ముందు మూడు అంతస్తులుగా ఏర్పాటు చేస్తారు. కింద భాగంలో ఉండే పెద్ద పాత్రలో అన్నం, పెరుగు, బెల్లం, పైన రెండో పాత్రలో పులుసు, దానిపై మట్టితో తయారుచేసిన చిప్పలో పత్తితో చేసిన వత్తి చేసి, మంచి నూనెతో వెలిగిస్తారు. ఆలయానికి వెళ్లే దాకా దీపం వెలుగుతూ ఉండేలా శ్రధ్ధ తీసుకుంటారు. ఈ బోనాలను వేప ఆకులు, పసుపు, కుంకుమతో అందంగా అలంకరిస్తారు. యువతులు బోనం ఎత్తుకుంటే వివాహం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. బోనాల ఊరేగింపులో శివసత్తులు ముఖానికి పసుపు రాసుకొని అమ్మవారిని స్తుతిస్తూ పూనకంతో ఊగిపోతారు.
తొట్టెల ఊరేగింపు…
బోనాల పండుగలో మరో ఆకర్షణీయమైన ఘట్టం తొట్టెల ఊరేగింపు. పలుచటి రంగుల కాగితాలతో ఐదంతస్తుల భవనంలా తయారు చేసి అమ్మవారికి సమర్పించడమే తొట్టెల అని పిలుస్తారు. తొట్టెల సమర్పించే భక్తులు ఇల్లు లేనివారైతే… తొట్టెల సమర్పించకోవడంతో ఇల్లు నిర్మించుకునేలా చూడు తల్లి అని వేడుకోవడం అని, ఇల్లు ఉన్న వారు తమ ఇల్లు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించుమని కోరుకుంటారు.
ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు..
బోనాల జాతరలో పోతరాజుల విన్యాసాలు అందరికీ కనువిందు చేస్తాయి. అమ్మవారి సోదరుడే పోతరాజు అని చెప్పుకుంటారు. ఒంటినిండా పసుపు రాసుకొని, నుదిటిపై పెద్ద సైజు లో కుంకుమ బొట్టు పెట్టుకొని, నడుముకు వేపాకులు, ము వ్వలు చుట్టుకుని… కాలికి గజ్జెలు కట్టుకొని, ఎరుపు రంగు ధోతిని ధరించి పెద్ద పెద్ద మీసాలతో, చేతిలో చెర్నకోల పట్టుకొని ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణతో ఉత్సవ మూర్తిలా కనిపిస్తుంటా రు. బోనాల ఉత్సవాల ప్రారంభ సమయంలో నిమ్మకాయలు కోసి నాలుగు వైపులా చల్లుతూ అమ్మవారి ఊరేగింపులో సం దడి చేస్తుంటారు. బోనాలు, అమ్మవారి ఊరేగింపు ఆరంభకుడిగా పోతరాజును చెప్పుకోవచ్చు. బోనాల పండుగలో పోతరాజులు డప్పు చప్పుడుకు అనుగుణంగా నృత్యం చేస్తూ, చేతిలోని చెర్నకోలను తిప్పుతూ ముందుండి ఉత్సవాలను కొనసాగిస్తారు. కొన్ని చోట్ల గొర్రె పొట్టేళ్లను అలంకరించి వాటికి చిన్నపాటి బండ్లు కట్టి ఫలహారం బండిగా ఊరేగింపు చేపడుతారు.