మంచిర్యాల, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని శనిగకుంటను కబ్జా చేసేందుకు హస్తం పార్టీ లీడర్లు భారీ స్కెచ్ వేశారు. అందుకే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ చెరువును ఆక్రమించేందుకు కాంక్రీటుతో నిర్మించిన చెరువు మత్తడికి బాంబులు పెట్టి పేల్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెరువుకు ఆనుకుని ఉన్న తమ భూముల్లోకి నీరు రాకుండా ఉంటే, రానున్న రోజుల్లో ఆ భూములను అమ్మేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలకనేత ప్లాన్ చేసి మరీ మత్తడిని పేల్చినట్లు సమాచారం. మత్తడిని పేలిస్తే చెరువులో ఉన్న నీరు తగ్గుతుందని ఇలా చేస్తే చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ వార్డులోని ముంపు ప్రాంతానికి కూడా నీరు రాదని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్‌ను రెచ్చగొట్టి, చెరువు మీదకు ఉసిగొల్పారనే చర్చ చెన్నూర్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సదరు కాంగ్రెస్ నేతతోపాటు నియోజకవర్గ అధికార పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నాయకులు శనిగకుంట చెరువును ఆనుకుని ఉన్న భూమిలో వెంచర్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలోనే చెరువు బఫర్‌జోన్‌లో 4 వేల ట్రిప్పుల మొరం పోసి కొంతమేర చెరువును కబ్జా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మొరం పోసి ఆక్రమించిన స్థలం చుట్టూ వరద చేరింది.
మరోసారి వర్షం పడితే అది మొత్తం మునిగిపోతుంది. అలా జరిగితే తమకు నష్టం వాటిల్లుతుందని, రానున్న రోజుల్లో ఎవరూ భూములు కొనేందుకు రారనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిసింది. సాధారణ రోజుల్లో మత్తడి కూలిస్తే ఇబ్బందని, వినాయక నిమజ్జనం జరిగే రోజైతే డీజే శబ్దాల్లో బాంబుల చప్పుడు కలిసి పోతుందని పక్కా ప్లాన్ చేసి మందు గుండు సామగ్రి తెచ్చి మరీ చెరువు మత్తడిని బ్లాస్ట్ చేశారని స్థానికులు చెప్తున్నారు.
శనిగకుంట చెరువు 39 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని శిఖం 33.22 ఎకరాలు ఉండగా ఎఫ్టీఎస్ 42 ఎకరాలు దీనికి బఫర్‌జోన్‌కు కలుపుకుంటే 60 ఎకరాలు అవుతుంది. ఈ భారీ చెరువు మత్తడి మూడు మీటర్ల ఎత్తులో 44 మీటర్ల పొడవుతో ఉంది. పూర్తిగా కాంక్రిట్‌తో నిర్మించిన ఈ మత్తడికి మీటర్‌కు ఒకటి చొప్పున హోల్స్ చేసి జిలిటెన్‌స్టిక్స్ అమర్చారు. వాటిని పేల్చేందుకు జనరేటర్ కూడా ఉపయోగించారు. ఇంత జరుగుతుంటే అధికారులకు ఎందుకు తెలియలేదు. జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్ల లాంటి మందుగుండు సామగ్రి మత్తడి వరకు ఎలా వచ్చింది. ఆ సమయంలో పోలీసులు ఎందుకు వారిని అడ్డుకోలేకపోయారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అంతా తెలిసినా ఇరిగేషన్‌శాఖ అధికారులతోపాటు, పోలీసులు మిన్నకుండి పోయారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మత్తడి పేల్చివేసిన ఘటనలో అనుమానితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని చెప్తున్న పోలీసులు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే విచారణ ఆలస్యం అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతటి పెద్ద కేసునైనా ఒకటి, రెండు రోజుల్లో ఛేదించే పోలీసులు నాలుగు రోజులుగా విచారణ కొనసాగుస్తుండడంతో కేసు పక్కదారి పట్టే అవకాశాలున్నాయనే మత్స్యకారులు, బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నిండిన చెరువును మత్తడిని పేల్చివేయడంతో 40 శాతం వరకు నీరు పోయి ఖాళీ అయ్యిందని, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన కాంగ్రెస్ కీలక నాయకులను కేసు నుంచి తప్పించి, స్థానిక కౌన్సిలర్‌ను ఇరికించడం కోసమే జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
సోమవారం రాత్రి మత్తడిని పేల్చేస్తే.. గురువారం వరకు జాప్యం చేయడం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి ఉందంటూ మండిపడుతున్నారు. గురువారం సాయం త్రం ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ప్రెస్మీట్లో నిజానిజాలు తెలుస్తాయని అంతా భావించారు. ఉదయం నుంచి ప్రెస్‌మీట్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన పోలీసులు సాయంత్రానికి అలాంటిది ఏమీ లేదని చెప్పారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. దీంతో కేసును తప్పుతోవ పట్టించడంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది.