నార్నూర్, అక్టోబర్ 15 : దీపావళి పండుగకు ప్రజలు పటాకులు కాల్చడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయడంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో గాంధీ చౌక్ చౌరస్తా ప్రధాన రహదారి ఇరువైపుల బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి అనుమతి లేకుండానే పటాకులు విక్రయాలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తును వీడటం లేదు. జన సంచారం ఉండే ప్రదేశంలో పటాకుల దుకాణాల ఏర్పాట్లు చేయడంతో ఏదైనా ప్రమాదం చేసుకుంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
అందుబాటులో ఎలాంటి అగ్నిమాపక పరికరాలు ఉంచకుండానే దర్జాగా విక్రయాలు చేపడుతున్నారు. అయితే ఈ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. దుకాణాల వద్ద పటాకుల కొనుగోలు చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కొందరు వ్యాపారస్తులు పటాకుల కూడా ఎలాంటి భయం లేకుండా కాలుస్తున్నారు. దీంతో మార్కెట్‌కి వచ్చే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి పటాకుల దుకాణాలను జన సంచారం లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.