కౌటాల, ఏప్రిల్ 22 : యూపీఎస్సీ ఫలితాల్లో కౌటాల మండల వాసి ఆల్ ఇండియా 949వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. మండలంలోని బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల రెండవ కుమారుడు సుధాకర్. వ్యవసాయదారులైన సోమయ్య- ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతు రు. రెండవ కుమారుడు సుధాకర్ ఇటీవల విడుదలైన గ్రూప్-4, 3, 2లలో ర్యాంకులు వచ్చినప్పటికీ వాటికి వెళ్లకుండా సివిల్స్ లక్ష్యంగా ప్రయత్నించాడు.
సుధాకర్ 1, 2 తరగతులు గ్రామంలో చదివి ఆ తర్వాత 3 నుంచి 5వ తరగతి వరకు కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఆ తరువాత సిర్పూర్ రెసిడెన్సియల్లో సీటు సాధించి 6 నుంచి 10వ తరగతి వరకు అక్కడ పూర్తి చేశాడు. ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో, కరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేశాడు.
సివిల్స్ సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాడు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 949వ ర్యాంకు సాధించి తన కలను నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తాను ఉన్నత ఉద్యోగం సాధించాలని కష్టపడినట్లు తెలిపాడు. మారుమూల మండలం నుంచి రాంటెంకి సుధాకర్ సివిల్స్‌లో సత్తా చాటడంతో మండల వాసులంతా ఆయనను అభినందించారు.