ఎదులాపురం, అక్టోబర్ 20 ః ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు మెరుపుదాడి చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫుడ్ సెఫ్టీ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ బృందం, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ముందుగా లక్ష్మీ నరసింహాస్వామి ఫ్యామిలీ రెస్టారెంట్, ఢిల్లీ వాలా స్వీట్ హౌస్, వెంకటేశ్వర స్వీట్‌హౌస్, లోటస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహా స్వామి(నాయుడు గారికుండ బిర్యానీ) ఫ్యామిలీ రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్లో ఫుడ్ సెఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మేయింటేయిన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో 30 కిలోల రూ.15 వేల విలువ కలిగిన కుళ్లిన మాంసపు ఉత్పత్తులను గుర్తించారు. హానికర రంగులను కలిపిన చికెన్, చేపలు లేబుల్ తదితర వివరాలు లేకుండా ఉన్నటువంటి పన్నీరు మసాలాలు ఉన్నాయి. బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం ఉత్పత్తులను ధ్వంసం చేసి యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్‌రెడ్డి, పి.స్వాతి, శ్రీషికలతో కూడిన బృందం సభ్యులు ఉన్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపక్షించబోం..
ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడేవారిని ఉపేక్షించబోమన్నారు. నాసిరకమైన పదార్థాలు వాడడం, కుళ్లిన మాంసం, మసాలాలు వాడడం, వంటగది అపరిశుభ్రంగా ఉండడం వంటి అనేక అంశాలు తన దృష్టికి వచ్చాయని జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తెలిపారు. ఇకపై ఆహార తయారీదారులు, హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా విడిచి పెట్టనని వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.