నార్నూర్ : అన్నదాతలను కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు బిక్షపతి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ( BJP protests ) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని అందించకపోవడంతో రైతులు విత్తనాలు, ఎరువులు అప్పులు చేసి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. యాసంగి సాగులో కూడా రెండు ఎకరాల వరకే రైతు భరోసా అందించి మిగతా రైతులకు మొండి చేయి చూపించారన్నారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవి దాస్, రాజు, శ్రీకాంత్, రవి తదితరులు ఉన్నారు.