ఆదిలాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానపర్చినందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మోదీ వైఖరికి నిరసగా మంత్రీ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని ఏడేళ్లుగా తెలంగాణ విషయంలో కడుపులో దాచుకున్న విషాన్ని కక్కాదన్నారు. విభజన హామీలను మరిచిన ప్రధాని తెలంగాణను అవహేళన చేశారు. పార్లమెంట్లో తలుపులు మూసి, పిప్పర్స్ప్రేలు చల్లి, లైట్లు ఆర్పేసి, చర్చ లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని మాట్లాడడంపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు యూనిస్ అక్బానీ, అలాల అజయ్, శివకుమార్, గంగారెడ్డి, ప్రహ్లాద్, నారాయణ, రమణ, ఖయ్యుం, పవన్‌కుమార్, బండారి కృష్ణ, భరత్, చంద్రయ్య, అనసూయ పాల్గొన్నారు.