పెంచికల్ పేట్, ఫిబ్రవరి 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన ‘బర్డ్‌వాక్ ఫెస్టివల్’ పక్షి ప్రేమికులను ఆకట్టుకున్నది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బర్డ్ వాక్ ఫెస్టివల్, నేచర్ ట్రైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం 50 మంది పర్యాటకులు వివిధ జిల్లాల నుంచి శనివారం సాయంత్రమే పెంచికల్ పేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి గుండేపల్లి అటవీశాఖ బెస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. నైట్ ఫైర్ క్యాంప్‌లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం బర్డ్ వాక్ ఫెస్టివల్‌ను స్థానిక ఎఫ్‌డీవో బొబడే సుశాంత్ సుఖ్‌దేవ్ ప్రారంభించారు. ఎల్లూరులోని బొకి వాగు ప్రాజెక్ట్ వద్ద విహరిస్తున్న పక్షుల అందాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలరాపు గుట్ట వద్దకు రాబందులను చూసేందుకు సఫారీ వాహనాల్లో వెళ్లారు.
50 రకాల పక్షుల గుర్తింపు..
ఐదు రకాల విదేశీ పక్షులతో పాటు 40 రకాల వలస పక్షులు, మరికొన్ని పక్షులను గుర్తించారు. ఇందులో బార్ హెడ్డెడ్ గూస్, గ్రీలాగ్ గూస్, రెడ్ క్రెస్టెడ్ పోచర్డ్, గాడ్ వాల్ డక్స్, నార్తర్న్ షావ్లర్స్, బ్లాక్ డ్రాగన్గో, యురేషాన్ స్పూన్ బిల్, వైట్ త్రోటేడ్ కింగ్ ఫిషర్, కామన్ హోప్, రివర్ టర్న్, గ్రే హార్న్ బిల్, నార్తర్న్ పిన్‌టెయిల్, స్పాట్ బిల్ డక్స్, బ్లాక్ వింజర్డ్ స్టిల్డ్, రెడ్ వాటర్ లాప్వింగ్, గ్రీన్ బి ఈటర్, ఓపెన్ బిల్ స్టార్, తదితర పక్షులు అలరించాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ అడవుల్లోని వన్యప్రాణులు, పక్షులను చూడడం సంతోషంగా ఉందని పర్యాటకులు అన్నారు.