ఆదిలాబాద్ : భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతిని నిర్వహిస్తుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) అన్నారు. భోరజ్ మండలం రాంపూర్ తదితర గ్రామాల్లో గురువారం భూభారతి సదస్సులను కలెక్టర్ సందర్శించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ( Revenue Meeting ) నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని, దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటుమన్నామని వివరించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రెవెన్యూ బృందాలను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశమై భూ భారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తు లను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూ భారతిలోని నిబంధనల పై అవగాహనను కలిగి ఉన్నప్పుడే, తప్పిదాలకు తావుండదని అన్నారు. భూ భారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను అమలు చేస్తున్నందున, ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ బృందాలు సమన్వయంతో పని చేస్తూ నిర్ణీత గడువులోపు దరఖాస్తుల పరిశీలన, విచారణలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.