భైంసా, మార్చి 17 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు మంగళవారం వేకువజాము నుంచే బారులుదీరారు. హజుబుల్, ఏగాం, మాటేగాం, మీర్జాపూర్, లింగ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 641 మంది క్యూ కట్టారు. ఓపిక లేకపోవడంతో తమ పాదరక్షలను క్యూలో పెట్టి వేచి చూశారు. ఏజెన్సీ నిర్వాహకులు ఉదయం 10 గంటలకు వచ్చి అందరికీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో గ్యాస్ కొరత వేధిస్తున్నదని మండిపడుతున్నారు.
ఇరాన్‌తో అమెరికా, ఇండోనేషియా యుద్ధాన్ని సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజు 500ల నుంచి 600ల వరకు ఆన్లైన్ బుకింగ్ నమోదవుతూ ఉంటాయి. బుకింగ్ చేసిన 2 నుంచి 3 రోజుల్లో సిలిండర్ డెలివరీ చేస్తారు. పది రోజులుగా బుకింగ్ చేసిన సిలిండర్ రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఇరాన్లో జరుగుతున్న యుద్ద పరిస్థితులను కారణంగా చూపుతూ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోందని కొందరు పేర్కొంటుండగా, ఇదే అదునుగా చేసుకొని కొంతమంది గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరోసారి బుకింగ్ చేసుకొనే అవకాశం లేకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. అధికారులు దృష్టి సారించి గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతున్నారు.
మంగళవారం ఉదయమే అన్ని పనులు మానే సుకొని గ్యాస్ ఏజె న్సీ వద్ద నిలబడు తున్నాం. ఇంట్లో వారు సమయానికి వంట చేయక ఇబ్బందులు పడుతున్నారు. రోజు గ్యాస్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాం. గ్యాస్ సరఫరాలో ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం.
– రాజు, భైంసా.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నా యి. ఇప్పటికే నిత్యా వసర సరుకుల ధరలు, కూరగాయ ల ధరలు ఆకాశన్నం టాయి. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్లను తగ్గించాలని లేదా పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
– సాయినాథ్, హస్గుల్.