మంచిర్యాల అర్బన్, మార్చి 17: జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక, సామాజిక దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని ఆరోగ్యశ్రీ, సాధారణ, డయాలసిస్ వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, హాజరు పట్టికలు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు సరిపడా బెడ్లు, దుప్పట్లు, పౌష్టికాహారం, మందులు, తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నూతన భవనం నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేసి దవాఖానను అందులోకి తరలిస్తామని వెల్లడించారు. విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, సమయ పాలన పాటించాలని, రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, దవాఖానలో పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రోగులు, వారి సహాయకులతో మాట్లాడి వసతులపై ఆరాతీశారు. ఆయన వెంట దవాఖాన పర్యవేక్షకుడు హరీశ్ చంద్రారెడ్డి, ఆర్ఎంవో భీష్మ ఉన్నారు.
పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్, మార్చి 17 : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, డీఈవో యాదయ్యతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షల కోసం జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, అధికారులను నియమించామని, జిల్లాలో 9,189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన వారు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పిస్తామని, 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. డీఎంహెచ్వో హరీశ్రాజ్, డీఐఈవో అంజయ్య, అధికారులు పాల్గొన్నారు.