మంచిర్యాలటౌన్, జూలై 7 : రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కోసం కృషి చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అమృత్పథకంలో భాగంగా రూ. 24 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల నమూనాలను ఆయన పరిశీలించారు.అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆపై స్టేషన్ బయటనున్న పరిసరాలను పరిశీలించారు. సందీప్ మాథూర్ మాట్లాడుతూ మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను చురుకుగా సాగుతున్నాయని, ప్రయాణికుల భద్రత విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మంచిర్యాలలో వందేభారత్ రైలుకు హా ల్టిం గ్ ఇవ్వాలని కోరగా, అందుకు ఆయన సానుకూలం గా స్పందించారు. దీంతోపాటే న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌రైలుకు కూడా హాల్టింగ్ ఇవ్వాలని కోరగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన సూపర్‌ఫాస్ట్ రైళ్లకు సంబంధించి హాల్టింగ్ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు రైల్వేజీఎంకు వినతిపత్రం అందించారు.
స్టేషన్లో వీల్చైర్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్ ఆవరణలో తమకు బతుకుదెరువు కోసం దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, మంచిర్యాల స్టేషన్లోనే దివ్యాంగుల పరీక్షలు నిర్వహించి పాసులు ఇవ్వాలని కోరారు. శ్రీరాందేవ్ సేవాసమితి నాయకులు రైల్వేజీఎంకు వినతిపత్రం అందించారు. చెన్నై నుంచి భగత్కోతి వరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. ఆయన వెంట రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.
బెల్లంపల్లి, జూలై 7 : బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాధుర్ పరిశీలించారు. ప్రత్యేక రైలు లో బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న జీఎం ముం దుగా మూడో లైన్ రైల్వే ట్రాక్ పనులను సందర్శించారు. రైల్వే ట్రాక్, ప్లాట్‌ఫాం నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చే యాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆర్వో హెచ్ షెడ్, సిక్లైన్ షెడ్, లాబీ రూం, సిగ్నలింగ్ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జీఎంకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో నాయకులు రమేశ్, నీరజ్ అగర్వాల్ ఉ న్నారు. రాంనగర్ అండర్ రైల్వే బ్రిడ్జిని పున:ప్రారంభించాలని సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, ఆడె పు రాజమౌళి, బొల్లం తిలక్ అంబేద్కర్, రాజం ఆ ధ్వర్యంలో జీఎంకు వినతిపత్రం అందజేశా రు. నవ్‌జీవన్, జీటీ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపాలని కోరారు.