బెల్లంపల్లి, సెప్టెంబర్ 8 : క్రీడాకారులకు బెల్లంపల్లి నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిచ్చామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవన్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే కుంగ్ ఫూ పోటీలను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అంతకుముందు చిన్నయ్య తండ్రి దుర్గం రాజం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు పెద్దపీట వేసిందని వెల్లడించారు. తాను అధికారంలో ఉన్న సమయంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 25 లక్షలతో కాంటా వద్ద కళామందిర్ మంజూరు చేశామని గుర్తు చేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని పనులు ప్రారంభం కాలేదన్నారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని వెల్లడించారు.
ప్రతి రోజూ సాధన చేస్తే జాతీయ స్థాయిలో పతకాలు సాధించవచ్చని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని 600 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చూపారు. బోయిని సహస్త్ర ఆధ్వర్యంలో బృందం నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ పలువురిని అలరించింది. టోర్నమెంట్ గ్రాండ్ చాంపియన్ షిప్ కోసం రాజేశ్, సంజీవ్ తలపడ్డారు.
విజేతగా రాజేశ్, రన్నరప్‌గా సంజీవ్ నిలిచారు. వీరికి నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ కో ఆర్డినేటర్ నరేశ్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజనాల రమేశ్, వైస్ చైర్మన్ సుదర్శన్, సీపీఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య, నాయకులు సబ్బని అరుణ్, నూనెటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.