మందమర్రి, డిసెంబర్ 9: అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని మావోయిస్టులకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యుడు బబ్బెర రవి ఇంటికి వెళ్లి అతని తల్లి లక్ష్మిని కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితులను ఏసీపీ తెలుసుకున్నారు. సుమారు 24 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న రవిని లొంగిపోవాలని చెప్పాలని సూచించారు. లక్ష్మికి పలు నిత్యావసర వస్తువులు, 25 కిలోల బియ్యం, దుప్పట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాధ్యం కానీ సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే తప్ప సాధించిందేమీ లేదన్నారు. జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులు అడవిలో ఉండి కుటుంబ సభ్యుల పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.