మంచిర్యాల, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “ఈనెల 16వ తేదీ రాత్రి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి వాగు నుంచి తాండూర్ మండలంలోని అచ్చలాపూర్‌కు వచ్చిన రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఆ ట్రాక్టర్లలో ఇసుకను రోడ్డు పక్కన పోయించి, తిరిగి పంపేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపైకి అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఈ సందర్భంగా రెండు ట్రాక్టర్లలో ఓ ట్రాక్టర్ యాజమానిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు ఎదురు తిరిగితే పోలీసోళ్లకు తొక్కించైనా ట్రాక్టర్లను తీసుకెళ్తామంటూ ఫోన్లోనే హుకూం జారీ చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనక్కి తగ్గారు..” అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదీ.. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ సోదరుడు ఎమ్మెల్యే వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న తీరు. నియోజకవర్గ నలుచెరుగులా అధికార పార్టీ నాయకులు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఇసుక దందా చేస్తున్న ఆ పార్టీ నాయకులు, అదే దందాలో పాతుకుపోయారని చెప్తుకుంటున్న ఎమ్మెల్యే పీఏకు మధ్య చెడడంతో బెల్లంపల్లి ఇసుక మాఫియా అసలు వ్యవహారం బట్టబయలైదన్న చర్చ స్థానికంగా సాగుతున్నది.
ఇలా ఈ నాలుగు బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ నిత్యం లక్షల రూపాయలు పోగేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు.. ట్రాక్టర్ల యూనియన్లను అడ్డం పెట్టుకొని అమాయకులైన ట్రాక్టర్ల యాజమానులతో ఆడుకుంటున్నారు. నాయకుల స్వార్థం కోసం ట్రాక్టర్లు నడిపిస్తూ పదో, పరకో సంపాదించుకోవచ్చని ఆశపడిన ట్రాక్టర్ల యాజమానులు.. క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల కేంద్రంగా ఇసుక అక్రమ మార్గంలో బెల్లంపల్లికి వస్తుండడంతో స్థానికంగా ఆ దందాను నడిపించే వ్యక్తులను ట్రాక్టర్ యూనియన్ను ముందు పెడుతున్నారు. నాయకుల స్వార్థాన్ని ట్రాక్టర్ యాజమానుల యూనియన్ సమస్యగా చూపిస్తూ.. వారిని బలిపశువులను చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ట్రాక్టర్లను పట్టిస్తున్నారు. దీంతో ట్రాక్టర్ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తొలిసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.25 వేల జరిమానా వేస్తుండడంతో సంపాదించుకోవడం ఏమో గానీ, పరువుపోవడంతోపాటు వేల రూపాయల్లో జరిమానాలు కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారులు చోద్యం చూడకుండా నియోజకవర్గం నలుమూలలా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, అనుమతులు ఇచ్చి అన్ని ట్రాక్టర్లు యూనియన్లు సమానంగా ఇసుక రవాణా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నెల 16వ తేదీన తాండూర్ మండలంలోని అచ్చలాపూర్‌లో తప్పించుకున్న ట్రాక్టర్లను మంగళవారం రాత్రి టేకులపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను తాండూర్‌కు తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అడ్డువస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తానంటూ హూకూం జారీ చేసిన అధికార పార్టీ మండలాధ్యక్షుడి ట్రాక్టర్ పట్టుబడిన ట్రాక్టర్లలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం బయటికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటారా.. లేకపోతే మొన్నటి మాదిరే మిన్నకుండిపోతారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై స్థానిక ఎస్సై విక్రమ్‌ను వివరణ కోరగా.. గ్రామస్థులు ఫోన్ చేయడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్లి ట్రాక్టర్లను తీసుకువచ్చారన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మొన్నటికి మొన్న నెన్నెల మండలంలోని కర్జి ఇసుక రీచ్ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. “కర్జి ఇసుక రీచ్ మూసివేసినా కొందరు ట్రాక్టర్ యాజమానులు రాత్రి వేళల్లో ట్రాక్టర్లలో ఇసుకను బెల్లంపల్లి పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారని.. నెన్నెల మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత అండదండలతో రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని.. మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బెల్లంపల్లి ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఇదే సమయంలో పనిపై బెల్లంపల్లికి వచ్చిన తన ట్రాక్టర్ అడ్డుకొని డ్రైవర్‌పై కర్రలు, మారణాయులతో దాడి చేశారని, అడగడానికి వెళ్లిన తనపైనా దాడికి పాల్పడ్డారని, ట్రాక్టర్‌ను ధ్వంసం చేశారని.. రాత్రివేళ మారణాయుధాలతో తిరుగుతూ నెన్నెల, జన్కాపూర్ ట్రాక్టర్ యాజమానుల నుంచి బెల్లంపల్లి ట్రాక్టర్ యూనియన్ సభ్యులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని నారా మల్లేశ్ అనే నెన్నెలకు చెందిన ట్రాక్టర్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు”.
ఇలా కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్, టేకులపల్లివాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడుతోపాటు నెన్నెల మండలంలోని కర్జి రీచ్, ఎ ర్రవాగుల నుంచి మాఫియాను విస్తరించిన అదే పార్టీకి చెందిన స్థానిక నాయకుడు, మొన్నటి వరకు వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ, అడ్డుగా ఉన్నాడని చెప్పి ఎస్సైనే బదిలీ చేయించారని చెప్తున్న పలుకుబడి కలిగిన మరో నేత.. ఇలా ముగ్గురు అధికారపార్టీ నాయకులు కలిసి కొంత కాలంగా బెల్లంపల్లి, తాండూర్ మండలాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పీఏ వెనుకుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న స్థానిక బెల్లంపల్లి వాగు నుంచి ఎర్ర ఇసుక(నాణ్యత కాస్త తక్కువ) ఉండే ఇసుకను సరఫరా చేసే వర్గానికి ఇది జీర్ణించుకోకుండా మారింది.
బెల్లంపల్లి ఇసుక మాఫియా స్థానిక వాగు నుంచి ఇసుకను తెచ్చి రూ.4000ల చొప్పున లోడ్ విక్రయించేవాళ్లు.. అదే రూ.4000 వేలకు నెన్నెల, కన్నెపల్లి నుంచి నాణ్యమైన ఇసుక వస్తుండడంతో స్థానికంగా దందాలో ఉన్న వారికి ఇబ్బంది అవడంతోపాటు ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఇది జీర్ణించుకోలేక ఒకరిపై ఒకరు ఆరోపణలు, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు, కేసులు దాకా వెళ్తున్నారని సమాచారం. ఇలా అక్రమ ఇసుక రవాణా కోసం అధికార పార్టీ వర్గాలుగా విడిపోయి ఆధిపత్యానికి ప్రయత్నిస్తుండడం, ఈ పంచాయతీలు పోలీస్ స్టేషన్ల వరకు చేరుతుండడంపై సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటూ పార్టీ పరువు పోయేలా వాళ్లు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో మొదలుపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని, పార్టీ నాయకులు కొందరు అక్రమ ఇసుక రవాణాను ఉపయోగించుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చే వే బిల్లులతో యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారని వాపోతున్నారు.