బెల్లంపల్లి, జూలై 10 : బెల్లంపల్లి భూ కబ్జాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఎక్కడ పడితే.. అక్కడ ప్రభుత్వ భూములు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. కొందరు రియల్టర్లు, అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. నకిలీ పత్రాలు సృష్టించి ఆపై ప్లాట్లుగా మార్చి విక్రయించడం ఆందోళనకు గురి చేస్తున్నది. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాలు వస్తే చాలు అప్పటికప్పుడు ట్రాక్టర్లతో చదును చేయించి, ఆపై ప్రహరీ నిర్మించి, ఆ స్థలాలను ఆధీనంలోకి తీసుకోవడం కలకలం రేపుతున్నది. ఇక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కోట్లాది విలువైన స్థలాల్లో భవనాలు నిర్మిస్తుండగా, యంత్రాంగం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
కూల్చిన చోటే మళ్లీ నిర్మాణం
కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి.. జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన జ్యోత్స్న, ఆ అక్రమ కట్టడాన్ని పిల్లర్లతో సహా కూల్చి వేయించింది. జ్యోత్స్న ఇక్కడి నుంచి తాండూర్‌కు బదిలీ కాగానే.. తిరిగి ఇక్కడ అక్రమార్కులు నిర్మాణానికి తెరలేపారు. మళ్లీ పిల్లర్లతో అక్రమ నిర్మాణాన్ని ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. దాని పక్కనే కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలంలో మరో భవనాన్ని అధికార పార్టీ నాయకులు మందుండి నిర్మిస్తున్నారని బహిరంగంగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన జాతీయ రహదారికి ఇరువైపులా విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి భవనాలు నిర్మించారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల సహకారంతోనే భూదందా మూడు పూలు.. ఆరు కాయలుగా విలసిల్లుతోందన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు బస్తీల్లోని ప్రభుత్వ భూముల్లో కూడా ఇదే తంతు కొనసాగుతున్నది.

పాత్రికేయుల స్థలాన్నీ వదలని అక్రమార్కులు
కన్నాల శివారులోని పాత్రికేయులకు చెందిన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలలేదంటే ఇక్కడ భూ దందా ఎంత మితిమీరి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. కన్నాల గ్రామ పంచాయతీ పరిధి జాతీయ రహదారి ఆనుకొని, గత కొన్నేళ్ల క్రితం పాత్రికేయులకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంపై కన్ను వేసిన అక్రమార్కులు ఇటీవల రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో చదును చేసి కబ్జాకు యత్నించారు. దాని పక్కనే ఉన్నా ప్రభుత్వ స్థలాన్ని కూడా ఇటీవల ట్రాక్టర్‌తో చదును చేసి ప్రహరీ నిర్మించడానికి యత్నించగా, స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
స్థానిక శ్మశాన వాటిక సమీపంలో ఖాళీ స్థలంపై కన్ను వేసిన భూకబ్జాదారులు ట్రాక్టర్‌తో చదును చేసి ప్రహరీ కోసం ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు. దాదాపు రెండు ఎకరాల స్థలం కబ్జా చేయడానికి యత్నాలు సాగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ భూ కబ్జాల విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా.. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న నిర్మాణాల స్థలాల వద్ద ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులు రాగానే సంబంధిత స్థలంలో ఆర్ఐతొ విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.