మంచిర్యాల అర్బన్, మే 29 : శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గురువారం రామగుండం కమిషనరేట్‌లో నెలవారీ సమీక్షలో భాగంగా నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్, ప్రస్తుత కేసులపై చర్చించారు. సీపీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిషరించాలని, మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా సాక్ష్యాధారాలను అందజేయాలన్నారు.
మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఏం. రమేశ్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.