జైనూర్, నవంబర్ 20: అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, పులి సంచారంపై సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు వద్ద అవగాహన కల్పించారు. అనంతరం సద్గురు పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పులి ఈ ప్రాంతానికి వలస వచ్చిందని, ఇక్కడ ఎకువ రోజులు ఉండదని తెలిపారు. అటవీ ప్రాంత సమీపంలోని రైతులు ఉదయం 9 గంటలలోపు చేల వద్దకు వెళ్లవద్దని, సాయంత్రం 4 గంటల లోపు తిరిగి ఇంటికి రావాలని సూచించారు.
రాత్రి వేళలో పంటలకు కాపలా వెళ్లే వారు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. అటవీ సమీపంలోని గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల కెరమెరి ఘాట్ ప్రాంతంలో కొలాం గిరిజన రైతు సీడం కన్నీరామ్కు చెందిన పశువుపై పులి దాడి చేసి చంపేయడంతో అటవీ శాఖ నుంచి మంజూరైన రూ.25 వేల నష్టపరిహారాన్ని బాధిత రైతుకు అధికారులు అందించారు. ఈ కార్యక్రమంలో కెరమెరి, జైనూర్ ఎఫ్ ఆర్వోలు మజారుద్దీన్, జ్ఞానేశ్వర్, డీఆర్వో రాజేశ్వరరావు, ఎఫ్‌ఎస్‌వోలు సకారం , భగవంత్‌రావు, ఎఫ్‌బీవో రవీందర్, మాజీ సర్పంచ్ కోట్నాక్ మోతుబాయి మాధవరావు, మాజీ ఉపసర్పంచ్ పార్వతి పుండలిక్, అటవీశాఖ ఉద్యోగులు, ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.