మంచిర్యాల, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కులగణన సర్వే నివేదికపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. సర్వే సరిగా లేదంటూ బీసీలు, దళితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. కులగణన నివేదిక తప్పుల తడకగా రూపొందించారని, దురుద్దేశపూర్వకంగా బీసీ జనాభాను తగ్గించి చూపారని కాంగ్రెస్ సర్కారుపై బీసీలు రగిలిపోతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను విస్మరించి, కేవలం కాంగ్రెస్ పార్టీ పరంగా వాటా కల్పిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, రాష్ట్రంలోని బీసీలను వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చేసిన ఇంటింటి సర్వేను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణకు పోవడంపై దళితులు ఆగ్రహంతో ఉన్నారు.
మాదిగలకు అన్యాయం చేశారంటూ ఆ సామాజిక వర్గం నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తే, 52 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాత లెక్కలను అనుసరించి 9 శాతం ఇవ్వడాన్ని మాదిగలు తీవ్రంగా తప్పు బడుతున్నారు. మరోవైపు మాల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. తాము కూడా వర్గీకరణతో నష్టపోతున్నామంటున్నారు. ఇలా బీసీ, మాదిగ, మాల సామాజిక వర్గాలు ఎవరికి వారు సర్కారు తీరుపై మండిపడుతున్నాయి.
కులగణన సర్వే నివేదిక తప్పులతో జనాల్లో వ్యతిరేకత పెరగగా.. అధికారిక కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి మండల, గ్రామస్థాయి దాకా ఆ పార్టీ నాయకుల్లో చీలక వచ్చినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీసీలకు డిప్యూటీ సీఎం సహా మరో రెండు మంత్రి పదవులకు బీసీ లీడర్లు అధిష్టానం ముందు పట్టుపడుతున్నారట. ఇక ఎస్సీ వర్గీకరణపై మాదిగ, మాల సామాజిక వర్గం ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారనే వార్తలు వస్తున్నాయి. మాలల పక్షాన వర్గీకరణపై చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఢిల్లీకి వెళ్లి మరీ లాబీయింగ్ చేస్తున్నట్లు పలు వార్తా కథనాలు వస్తున్నాయి. మరోవైపు మాదిగ సామాజిక వర్గం నాయకులు ఇప్పుడు ఇస్తామంటున్న 9 శాతం రిజర్వేషన్లు 11 శాతానికి పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో పార్టీలోని దళిత నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తున్నది. అదే తరహాలో జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకతిస్తూ ఉమ్మడి జిల్లాలో దళిత నాయకులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు. ఇంద్రవెళ్లిలోఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. దేశ జనగణలో కులగణన జరపాలని పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పర్చాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపి రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 ః రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉపకులాలవారీగా తప్పుడు రిజర్వేషన్లు కల్పించడంతో ఎస్సీలకు నష్టం కలుగుతుందని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ అధ్యక్షుడు సోన్కాంబ్లే మనోహర్, ప్రధాన కార్యదర్శి కామ్రాజ్ వాగ్మారే అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలలోని ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుందన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 6 ః పార్లమెంట్ చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి అమలు పర్చాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు విలాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, రూ.2 లక్షల కోట్లతో బీసీ సంక్షేమ, అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలన్నారు. జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని, బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 ః రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణతో ఉప కులాలకు రిజర్వేషన్ల పరంగా నష్టం కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎస్సీలపై సర్వే చేయించింది. ఎస్సీ వర్గీకణను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి. కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది. ఇప్పటికే ఎస్సీలలోని అనేక కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరం అవుతున్నాయి.
– కామ్రాజ్ వాగ్మారే, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 ః రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీల వర్గీకరణతో దళిత బహుజనులకు రిజర్వేషన్ల పరంగా నష్టం జరుగుతుంది. ఎస్సీలను కులాలవారీగా విడదీసి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఎస్సీల ఐక్యతను చెల్లా చెదురు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది. ఎస్సీ వర్గీకణను ప్రభుత్వం రద్దు చేసి దళిత బహుజనులకు న్యాయం చేయాలి. వర్గీకరణ చేయడంతో ఎస్సీలలో ఉన్న ఉప కులాలకు నష్టం తప్ప న్యాయం జరగదు.
– కాంబ్లే అతిష్, దళిత సామాజిక కార్యకర్త.
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 6: కుల గణనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. అసలు కుల గణన అనేది అందరికీ నచ్చినట్లు కాకుండా వారికి అనుగుణంగా చేసుకున్నారని చెప్పవచ్చు. ఇందులో అన్ని కులాలకు ప్రాధాన్యత దక్కలేదు. ఈడబ్ల్యూఎస్ ప్రస్తావన రాలేదు. బీసీలు తగ్గి రెడ్డి, రావులు పెరిగినట్లు కుల గణనలో చూపుతున్నారు. రాష్ట్రంలో బీసీలతో పాటు మైనార్టీ బీసీలను కలిపితే మొత్తం 60 శాతానికి పైగా జనాభా ఉంటుంది. కానీ ప్రభుత్వం తప్పుల తడకగా పేర్కొన్నది. మాలమాదిగ, బహుజనులు కోటా కోసం పోరాడుతున్నారు. వారిని కూడా మోసం చేస్తున్నారు. బీసీల్లో కూడా అందరికీ అవకాశం దక్కాలి. సామాన్యుడికి బీసీ గణన చేరలేదు. బీసీ గణనపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంచిర్యాలలో శుక్రవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ జనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.
– డాక్టర్ చుంచు రాజ్‌కిరణ్, బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కన్వీనర్
నిర్మల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణన ప్రకారం మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన లెక్కల మేరకు రాష్ట్రంలో 15 శాతం మంది మాలలు ఉన్నారు. వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు, అదే నిష్పత్తి ప్రకారం 32 శాతం ఉన్న మాదిగలకు జనాభా ప్రాతిపదికన 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 శాతం మాత్రమే కేటాయించి మాదిగలకు మోసం చేసింది. వాస్తవానికి జనాభా ప్రకారం చూస్తే మాలలకు 3 శాతం మాత్రమే వర్తింపజేయాలి. గతంలో మాదిగలు, మాలలు, వాటి ఉప కులాలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పుడు కొంత వరకు మాదిగలకు న్యాయం జరిగింది.
ఇప్పుడు నాలుగు గ్రూపులను 1,2,3 కేటగిరీలు చేశారు. మాదిగల కేటగిరీలో ఉన్న బుడగ జంగాలను 1వ కేటగిరీలో కలుపడంతో లక్షకు పైగా జనాభా ఉన్న వారు 2వ కేటగిరీలో తగ్గిపోయారు. దీంతో మాదిగల జనాభా మరో లక్ష వరకు తగ్గింది. మాదిగలకు రిజర్వేషన్లు తగ్గించాలన్న కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కొత్త నాటకాలకు తెరలేపింది. మాదిగలు, మాలలకు మధ్య చిచ్చు పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నది. 30 ఏళ్లుగా ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలు అనేక పోరాటాలు చేయగా, ఇటీవలే సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ వర్గీకరణ ఫలాలు మాదిగలకు పూర్తి స్థాయిలో అందకుండా చేస్తున్న కాంగ్రెస్ పాలకుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతాం. అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపట్టి 11 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు మాదిగలతో కలిసి పోరాడుతాం.
– శ్యాంసుందర్, బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయకర్త