మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 1 : పూల పండుగ రానే వచ్చింది. తెలంగాణ మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ప్రాధానమైనది బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మ పండుగలో ఇమిడి ఉంటుంది. దసరాకు ముందుగా వచ్చే ఈ పండుగను గౌరీ పండుగ, సద్దుల పండుగ, పూల పండుగ అని కూడా పిలుస్తారు. మహాలయ అమావాస్య అయిన బుధవారం మొదలయ్యే బతుకమ్మ (ఎంగిలి పూలు) సంబురాలు సద్దులతో ముగుస్తాయి.
ఒక్కో పూప్వుకు ఒక్కో ప్రత్యేకత..
పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే వేళ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మకు అలంకరించే పూలకు పలు ప్రత్యేకతలున్నాయి. పసుపు పచ్చ రంగులో తంగేడు పువ్వు శుభాలకు సూచికగా నిలుస్తున్నది. ఎర్రగా ఉండే గోరింట, ఎర్రకట్ల పూలు ప్రేమానురాగాలకు చిహ్నం. తెలుపు రంగులో ఉండే గునుగు పూలు శాంతిని చాటిచెప్తాయి. ఆకుపచ్చగా ఉండే గుమ్మడి, దోస ఆకులు సస్యశ్యామలానికి నిదర్శనం.
వీటికి తోడుగా బంతిపూలు, చామంతి, తామర, టేకు, తెల్లకట్ట, వాము, గడ్డిపూలను బతుకమ్మ అలంకారానికి వాడుతారు. సంబురాలు జరుపుకునే తొమ్మిది రోజుల్లో మహిళలు బొడ్డెమ్మ (మట్టితో చేసిన దుర్గాదేవి ప్రతిమ)ను బతుకమ్మతో పాటు చేసి ఒకచోట చేర్చుతారు. చీకటి పడేదాకా బతుకమ్మ పాటలు పాడుతూ.. ఆడుతూ బొడ్డెమ్మలు తీస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ పేరుతో జలశయాల్లో నిమజ్జనం చేస్తారు.
మార్కెట్లో సందడి
మంచిర్యాల మార్కెట్లో మంగళవారం పండుగ సందడి కనిపించింది. మహిళలు తీరొక్కపూలను కొనుగోలు చేశారు.