మంచిర్యాలటౌన్, నవంబర్ 22 : ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. బుధవారం మంచిర్యాలలోని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ విప్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావుతో కలిసి మాట్లాడారు. నిన్న తండ్రి లాంటి కేసీఆర్ పై వివేక్ చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చావు నోట్లో తలపెట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసి, తెలంగాణను సాధించి, పదేళ్లపాటు తెలంగాణను పరిపాలించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి వ్యక్తిపై డబ్బు అహంకారంతో మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, 1969లో సాధ్యం కాని తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
వివేక్ తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు ఆయన శవాన్ని గాంధీభవన్‌కి కూడా తీసుకురాకుండా కాంగ్రెస్ అవమానించిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించడమే కాకుండా ఆయన జయంతి..వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్‌కు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.సోషల్ మీడియాలో కేసీఆర్‌పై, తనపై అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని, అయినా మేము సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. వివేక్, అతని కుటుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నామని, ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.
నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా డబ్బు సంచులతో, నోట్ల కట్టలతో మా లీడర్లను కొంటున్నారని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ధన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దొంగే.. దొంగదొంగా అన్న చందంగా వివేక్ పద్ధతి ఉన్నదని, ఓటమి భయంతో దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడని అన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 8 కోట్లు బదిలీ చేసింది వాస్తవం కాదా అని, మొన్న రూ. 50 లక్షలను చెన్నూరుకు తరలిస్తూ ఆధారాలతో సహా దొరికిన విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిశోర్, వెలుగు పత్రిక మారెటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
నిజంగా తప్పు చేయకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. వచ్చే ఒకటీ రెండు రోజుల్లో లీడర్ల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతామని, నాడు ఎంపీగా వివేక్ తండ్రి వెంకటస్వామి, మంత్రిగా అన్న వినోద్, ఎంపీగా వివేక్‌లు పనిచేశారని, ఆ సమయంలో జరిగిన అభివృధ్ది ఏమిటో, తెలంగాణ వచ్చిన ఈ పదేళ్లలో అభివృద్ది ఏమిటో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఐటీ, ఈడీ దాడులు బీజేపీ పనే
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌పై బీజేపీ కక్ష తీర్చుకుంటున్నదని చీఫ్‌విప్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ కార్యాలయాలపై, వివేక్ ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు బాల్కసుమన్, బీఆర్ఎస్ పనేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీకి నీవు చేసిన మోసాన్ని.. వాళ్లు ఎలా విడిచిపెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల ఇండ్లపై కూడా ఐటీ దాడులు అవుతున్న విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. వివేక్‌కు సంబంధించిన వివరాలన్నీ బీజేపీ చేతిలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతిలో ఉన్నాయని, పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీకు వారు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఐటీ, ఈడీ శాఖలు కేంద్రం పరిధిలో ఉంటాయని, బీఆర్ఎస్కు వాటితో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఓటమి భయం పట్టుకునే వివేక్ కేసీఆర్‌పై, బాల్క సుమన్‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, కేసీఆర్‌పై మాట్లాడే స్థాయి ఆయనకు లేదని అన్నారు. ఆరుసార్లు పార్టీలు మారిన వివేక్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ నెల 30న ప్రజలు ఓటుతోనే వివేక్‌కు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టీబీజీకేఎస్ నాయకులు కెంగెర్ల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు అందుగుల శ్రీనివాస్, డాక్టర్ రాజారమేశ్, గాదె సత్యం, అత్తి సరోజ, గోగుల రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.