శ్రీరాంపూర్, సెప్టెంబర్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, దాచుకునుడు.. దోచుకునుడే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమంలో భాగంగా నాయకులు 16 రోజుల పాటు చెన్నూర్ నియోజకవర్గంలో ఊరూరా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించారు.
గురువారం ఆ కార్యక్రమం ముగియగా, ప్రజల నుంచి స్వీకరించిన 45 వేల ఫిర్యాదులతో రామకృష్ణాపూర్‌లోని బాల్క సుమన్.. తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో నస్పూర్‌లోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వందలాది మంది కార్యకర్తలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సూపరింటెండెంట్ రాజేశ్వర్‌కు 45 వేల ఫిర్యాదులు అందజేశారు. ప్రజా సమస్యలు, హామీలను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఇందుకు ఏవో స్పందిస్తూ ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
రెండేళ్లు ఆగినం.. ఇక తిరుగుబాటే..
కాంగ్రెస్ మోసపూరిత హామీలు, వాగ్ధానాలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ఈ రెండేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చింది లేదని, ఇక ఆగేది లేదని, తిరుగుబాటు తప్పదని ప్రజలు నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. కామారెడ్డి, వరంగల్‌లో డిక్లరేషన్ల పేరుతో ప్రజలను వంచించిందన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఇంత వరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైనా వారికి తామే ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పుకుంటుందన్నారు.
రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్యేగోచరంగా మారిందని, వెంటనే హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలంతా రెండేళ్లు సహనంతో ఉన్నారని, ఇక ఎన్ని మాయమాటలు చెప్పినా వారు నమ్మే స్థితిలో లేరని, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 జడ్పీటీసీలు, 5 ఎంపీపీలు, 2 మున్సిపాలిటీలు, సర్పంచులు, ఎంపీటీసీ, వార్డుమెంబర్ల స్థానాల్లో గులాబీ జెండా ఎగరబోతుందని వివరించారు.
45 వేల ఉద్యోగాలు ఏవీ..
శాసనసభ ఎన్నికల్లో గడ్డం వివేక్ అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని బాల్క సుమన్ ఆరోపించారు. తాను గెలిస్తే చెన్నూర్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి 45 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, వంద పడకల దవాఖాన నిర్మిస్తామని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని వివేక్ అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పటి వరకు ఆయన ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైనా పనులకు సంబంధించిన నిధులను రద్దు చేశారని మండిపడ్డారు. తమ హయాంలో నిర్మాణం పూర్తి చేసిన అభివృద్ధి పనులను తామే చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కలెక్టరేట్ వద్ద మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఉపేందర్‌రావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రాజారమేశ్, రిక్కుల మధూకర్‌రెడ్డి, బల్మూరి అరవిందరావు, రాజ్‌కుమార్, ఆర్నె సమ్మయ్య, దామోదర్‌రెడ్డి, మంత్రి బాపు, రాంలాల్, విద్యాసాగర్, ఓదెలు, సాంబాగౌడ్, అబ్బాస్, బత్తుల శ్రీనివాస్, అనిల్‌రావు, రామిడి కుమార్ పాల్గొన్నారు.