మంచిర్యాలటౌన్, జూన్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంటలు, వసతులను పరిశీలించారు.
శ్రావణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మంచిర్యాలలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవని, ఉడికీ ఉడకని అన్నం, నాసిరకం కూరగాయలతో విద్యార్థులకు భోజనం పెట్టడం దుర్మార్గమన్నారు. అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం పట్టణంలోని నారాయణ పాఠశాలను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నార్ల వంశీకృష్ణ, మందమర్రి పట్టణ అధ్యక్షులు ఎండీ ముస్తఫా, బీఆర్ఎస్ నాయకులు బలికొండ రమేశ్, పడాల రవీందర్, బోయిని శేఖర్, బబ్లూ, ప్రశాంత్, షకీల్, సాయి కిరణ్, సుధీర్, మనోజ్, కల్యాణ్ పాల్గొన్నారు.