బజార్హత్నూర్, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతర్ల, మాడగూడ, పార్డి, పట్నాపూర్ పాఠశాలలకు చెందిన 185 మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా సరస్వతీ దేవి చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల ఒళ్లో చిన్నారులను కూర్చొబెట్టుకొని ఒక్కొక్కరికీ అక్షర శ్రీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు.
గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరిజన బిడ్డల కోసం అక్షర శ్రీకారం కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ జాదవ్ అంబాజీ, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, మండల విద్యాధికారి కిషన్గుప్తా, ఏసీఎం జగన్, జీసీడీవో ఛాయా, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చందన్, కిషన్రెడ్డి, సుదర్శన్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.