భైంసా, డిసెంబర్ 1 : కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఎంతో పవిత్రత, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష సాగించిన స్వాములు ఇరుముడి ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. ఈ మెట్లను అదిరోహించడం ద్వారా అవిద్య, అజ్ఞానం తొలగిపోయి స్వామి అనుగ్రహం లభిస్తుందని దీక్షదారుల నమ్మకం. ఆధ్యాత్మిక, ఆరోగ్య సూత్రాల మేళవింపు, అయ్యప్పదీక్ష. మనసు శరీరాన్ని పవిత్రం చేసుకొని ఆధ్యాత్మిక చింతనతో తనను తాను మార్చుకునేందుకు 41 రోజుల దీక్ష ఉంటుంది. హరిహర సుతుడు అయ్యప్ప.. ఇందులో అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు పేర్ల సంగమంతో అయ్యప్ప నామం ఆవిర్భవించింది. మహిషి అనే రాక్షసున్ని సంహరించి అయ్యప్ప కేరళలోని శబరిమలలో వెలిశాడు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి. దీక్షలు ఆధ్యాత్మికం, మానవ విలువలను పెంపొందించుకునేందుకు దోహదపడుతాయి. మాలధారణ, నల్లని వస్త్ర ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనం, కుంకుమతో అలంకరించుకోవడం వంటి ఆచారాలు, ఆధ్యాత్మికతకు ఉపకరిస్తాయి. శరీరంపై బస్మధారణ ఈశ్వర సాంకేతానికి, నూదిటిపై మెరిసే తిరునామం విష్ణు మూర్తిని గుర్తు చేస్తుంది.
41 రోజుల దీక్ష ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. భక్తి భావంతో పాటు ఆహార అలవాట్లలో మార్పుల కోసం అనేక మంది ఈ దీక్షను తీసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేవడం చైతన్యానికి ప్రతీకగా, సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానంతో నాడి వ్యవస్థ ఉత్తేజపరచడం, నేల మీద పడుకోవడం ద్వారా వెన్నునొప్పుల సమస్యలు తగ్గిపోవడం, కండరాల పటిష్టత, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. నిత్య దీపారాధనతో మనస్సు తేలికపడి స్నేహం, ప్రేమానురాగాలు పెరుగుతాయి. పొగ తాగడం, మద్యపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అయ్యప్ప దీక్ష నియమాలు ఎంతో కఠినంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనతో తనను తాను దక్కించుకునే అవకాశం దక్కుతుంది. మనసు ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుంది. అయ్యప్పమాల ధరించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మనస్సు శరీరాన్ని పవిత్ర చేసుకోవడం అయ్యప్ప మాలధారణ ప్రత్యేకత. నిష్టతో దీక్షలు చేసేవారు ఆదర్శంగా నిలుస్తారు.
– మంత్రి సాయినాథ్, గురుస్వామి
అయ్యప్ప మాలధారణ ఎంతో పవిత్రమైనది. మనిషిలో మానవతా విలువలు పెంపొందుతాయి. 20 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్న. నడవడిక, ఆరోగ్యం, జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమ శిక్షణ అలవడుతుంది. అయ్యప్ప మాలధారణ నియమాలు ఎదుగుదలకు దోహదపడుతాయి.
– కుంట శ్రీనివాస్, గురుస్వామి
అయ్యప్ప మాలధారణ జీవన ప్రమాణాలను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తన విధిని గుర్తిస్తారు. సంఘ జీవిగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. తోటి వారిని ఎలా గౌరవించాలో అలవర్చుకుంటారు. పూజలు, భజనల ద్వారా స్నేహభావం, సమైక్యత పెంపొందుతుంది. నడవడిక మెరుగుపడి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది.
– వెంకటేశ్ (చిక్కి), మెప్మా, సీవో