నమస్తే నెట్వర్క్ : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా సోమవారం పల్లెలు.. పట్టణాలు.. జై శ్రీరాం నామస్మరణతో మారుమోగాయి. రామాలయం, హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో సీతారాముల చిత్రపటాలు, పట్టువస్ర్తాలు, అక్షింతలతో బ్యాండ్ మేళాలు, మంగళహారతులు, కోలాటాల మధ్య కనుల పండువగా శోభాయాత్రలు నిర్వహించారు.

చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆసిఫాబాద్‌లోని కోదండ రామాలయంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సిద్దంశెట్టి సుహాసిని పాల్గొన్నారు. ఎస్పీ సురేశ్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ నుంచి బాలభారతి హనుమాన్ ఆలయం వరకు తలంబ్రాలతో శోభాయాత్ర నిర్వహించారు.
ఈఎస్ఐ అభయాంజనేయ స్వామి ఆలయం, సర్‌సిల్క్ రామమందిర్, బాలజీనగర్ శివాలయం, చింతగూడ హనుమాన్ మందిర్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణంలోని జడ్పీబాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన సుదర్శణ నారసింహ యాగం, మహాపూర్ణాహుతిలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులు పాల్గొన్నారు. పాతమంచిర్యాలలోని రామాలయం, శివాలయం, భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి అధ్యక్షతన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ భవ్య శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జై శ్రీరాం… నినాదాలతో పట్టణం మారుమోగింది. మహిళలు కోలాటం, డీజే, చప్పుళ్ల నడుమ ర్యాలీ సాగింది. కోటపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్‌లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పాల్గొన్నారు. భీమారంలోని కోదండరామాలయంలో నిర్వహించిన పూజల్లో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. దండేపల్లి మండలం పాత మామిడిపెల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సలీం మతసామరస్యాన్ని చాటాడు. నుదుట తిలకం దిద్దుకొని.. కాషాయ జెండాతో శోభాయాత్రలో పాల్గొన్నాడు.