నస్పూర్, మే 9 : రైతులు శాస్త్రీయ పద్ధతులే కాకుండా వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, మ్యాట్రిక్స్ కంపెనీ సీఈవో ఉదయ్‌కుమార్‌తో కలిసి వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పంటలైన వరి పంటలను మార్పు లేకుండా సాగు చేయడం వల్ల భూ సారం దెబ్బతింటుందన్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంభించడం వల్ల భూసారం పెరుగుతుందని, భూగర్భ జలాలను కాపాడుకోవచ్చన్నారు. యేటా పంటల సాగు ఆలస్యం కావడంతో అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతున్నదని, ముందస్తుగా సాగు ప్రారంభిస్తే ఆ నష్టాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. మం డల వ్యవసాయాధికారులు వారి పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను పర్యవేక్షించాలని, ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలు, ఆఫ్‌లైన్ నిల్వలను పరిశీలించి, కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, మే 9 : బెల్లంపల్లిలో పారిశుధ్య నిర్వహణ పకడ్భందీగా చేపట్టి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. పట్టణంలోని డంప్ యార్డును కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అంతర్గత రహదారులు, మురుగుకాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వార్డుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అమృత్ 2.0 లో భాగంగా నీటి ట్యాంక్ పనులను పరిశీలించారు. వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, ఉద్యోగుల హాజరు పట్టిక, మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, పురోగతి వివరాలను దగ్గరుండి పరిశీలించారు. ఇంటింటికీ తాగునీరు అందించాలని, మిషన్ భగీరథ పథకం అందుబాటులో లేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.