బెల్లంపల్లి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ (Auto drivers) , వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు యూనియన్ మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు ( JAC President ) కట్ట రాంకుమార్ తెలిపారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంటా చౌరస్తాలో సింగరేణి అన్వేషణ విభాగం ప్రహారీని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆటో యూనియన్‌కు కేటాయించాలని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు భోజన వసతి, మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఆటో స్టాండ్ స్థలాన్ని కేటాయిస్తూ అనుమతినివ్వాలని కోరారు. పట్టణంలో ఉన్న పలు ఆటో స్టాండ్ స్థలాలు కబ్జాలకు గురయ్యాయని, భవిషత్తులో ఆ స్థలాలు మరింతగా కబ్జా కాకుండా కలెక్టర్ చొరవ చూపాలని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని వివరించారు.
కబ్జాలను అడ్డుకోకపోతే తాము రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరి బస్టాండ్ వెనుక ప్రస్తుత ఆటో స్టాండ్‌ను కొంతమంది కబ్జా చేయడానికి యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని ఆటో యూనియన్‌కు మంజూరు చేయాలని కోరారు.