మందమర్రి/కన్నెపల్లి/బెల్లంపల్లి/తాండూర్, డిసెంబర్ 20 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో డ్రైవర్లను ముందస్తుగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ వారు సర్కారుపై మండిపడ్డారు. శుక్రవారం మందమర్రి పట్టణం నుంచి హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్తున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని ఆటో యూనియన్ అధ్యక్షుడు మొయ్య రాంబాబు మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆటో డ్రైవర్లు బత్తిని రాజేశ్, బొల్లు రవి, రాజ్‌కుమార్, సారయ్య, గోవిందుల శంకర్, ఎస్కే.గౌస్, బండారి మల్లేశ్, శంకర్, కట్టప్ప ఉన్నారు. కన్నెపల్లిలో ఆటో డ్రైవర్లు పందిర్ల అంజయ్య, చెండె సత్యనారాయణ, శేఖర్‌లను అరెస్టు చేశారు. బెల్లంపల్లిలో ఆటో యూనియన్ నాయకులను వన్‌టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ.12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాండూర్ మండల ఆటో డ్రైవర్లను శుక్రవారం ముందస్తుగా అరెస్ట్ చేసి మాదారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ ఆర్టీసీ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఎలాంటి నష్టం జరగడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.