మంచిర్యాల, జూన్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘గాడి తప్పిన మైనార్టీ గురుకులం’ శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ‘మైనార్టీ గురుకుల పాఠశాలలో రెగ్యులర్, సీనియర్లను కాదని జూనియర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అందలం ఎక్కించడం.. చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలను తరలించమని టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ ఆదేశాలిచ్చినా.. పట్టించుకోకపోవడం వెనుక మతలబేమిటి..’ అన్న ప్రధాన అంశాలను వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ తతంగం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి(డీఎండబ్ల్యూవో) స్పందించారు. “చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలను మందమర్రిలోని సింగరేణి మహిళా జూనియర్, డిగ్రీ కాలేజీ భవనంలోకి మార్చమని టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఈ మేరకు మందమర్రిలోని ఆ భవనాన్ని పరిశీలించి పాఠశాల నిర్వహణకు అనువైనదిగా గుర్తించాం. కానీ, మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ప్రాంతీయ స్థాయి సమన్వయకర్త(ఆర్ఎల్సీ) తదుపరి ఆదేశాలిచ్చే దాకా పాఠశాలను మార్చొద్దని టీఎంఆర్ఈఐఎస్ హైదరాబాద్ నుంచి చెప్పినట్లు టెలిఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆర్ఎల్సీ చెప్పడంతో హైదరాబాద్‌లోని ఆ సంస్థ అధికారులను తెలుసుకొని, వారి ఓరల్ ఆదేశాల మేరకు పాఠశాలను తరలించలేదు” అని తెలిపారు. టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ పేపర్‌పై ఇచ్చిన ఉత్తర్వులను ఆపమని ఓరల్‌గా చెప్పింది ఎవరు.. ఆర్ఎల్సీ ఓరల్‌గా చెబితే పాఠశాలను తరలించకుండా ఎలా ఆపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పరమైన ఏ ఆదేశాలైనా ఉత్తర్వుల రూపంలో ఉండాలి. కానీ, ఓరల్‌గా టెలిఫోన్లో చెబితే ఎందుకు ఆపేశారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలోని సమస్యలను స్వయంగా అధికారులే నిర్ధారించారు. చెన్నూర్ నుంచి మందమర్రికి పాఠశాలను తరలించాలని సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల్లోనే ఇక్కడ ఏ సమ్యలున్నాయన్నది స్పష్టంగా పేర్కొన్నారు. క్లాస్ రూముల్లో తగినంత వెంటిలేషన్ లేదు. ప్లే గౌండ్ లేక విద్యార్థులు ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతున్నారు. స్కూల్ నిర్వహిస్తున్న భవనం గ్రౌండ్ ప్లోర్లో ఫర్టిలైజర్ షాప్ సైతం నిర్వహిస్తుండటంతో కెమికల్స్ నుంచి పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. డ్రైనేజీ లీకేజీ సమస్యతో క్లాస్ రూమ్‌లలో దుర్గధం వెదజల్లుతున్నది. 300 మంది పిల్లలు చదువుతున్న ఆ స్కూల్ బిల్డింగ్ అపార్ట్మెంట్ టైప్‌లో ఉన్నది. కేవలం 13,964 ఎస్ఎఫ్టీలో ఉన్న పాఠశాల పిల్లలకు సరిపోవడం లేదు. తరగతి గదులు సరిపోక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. అన్నింటికీ మించి ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది మైనార్టీలు ఉన్నారు.
మైనార్టీ అడ్మిషన్లకు ఇది సరైన ప్రాంతం కాదు.. మంచిర్యాల నుంచి 40 కిలోమీటర్లు, బెల్లంపల్లి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఉంది. దీంతో రవాణా సౌకర్యం లేక తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించడానికి నిరాశక్తి చూపుతున్నారు. ఈ కారణాలు అధికారులు గుర్తించిన నేపథ్యంలో చెన్నూర్ నుంచి పాఠశాలను తరలించాలని సెక్రటరీ ఇచ్చిన ఉత్వర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటు టీజీఎంఆర్ఈఐఎస్ అసిస్టెంట్ ఇంజినీర్, కన్సల్టెంట్ ఇంజినీర్, ఆర్ఎల్సీ, ప్రిన్సిపాల్ స్వయంగా స్కూల్ తరలింపునకు ప్రతిపాదిస్తున్న మందమర్రిలోని సింగరేణి భవనాన్ని పరిశీలించారు. 64,400 ఎస్ఎఫ్టీ సువిశాల విస్తీర్ణంలో ఉన్న భవనం అన్ని విధాలా బాగుందని గుర్తించారు. టీజీఎంఆర్ఈఐఎస్ సూచనల మేరకు క్లాస్‌రూమ్స్, రెస్ట్‌రూమ్స్ అవసరమైన ఇతర వసతుల పనులను మే,2026 నాటికి పూర్తి చేసి అప్పగించేందుకు భవన యాజమాన్యం నుంచి ఆక్యూపై లెటర్ సైతం తీసుకున్నారు. ఈ మేరకు మంచిర్యాల డీఎండబ్లూవో మందమర్రిలోని భవన యాజమాన్యం సింగరేణితో ఒప్పందం చేసుకొని, పాఠశాల తరలించాలని సెక్రటరీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉంది. మరి ఇన్ని సమస్యలున్నట్లు గుర్తించిన స్కూల్ భవనాన్ని చెన్నూర్ నుంచి మార్చకపోవడం, మౌఖిక ఆదేశాలతో ఆపేశామని చెప్పడం ఎంత వరకూ సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో డీఎండబ్ల్యూవోతో పాటు మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఆర్ఎల్సీ తీరు వివాదాస్పదంగా మారింది. చెన్నూర్‌లోని భవనం స్కూల్ నిర్వహణకు అనుకూలం కాదని, సమస్యలున్నాయని గుర్తించి, మౌఖిక ఆదేశాల పేరుతో స్కూల్‌ను తరలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనం మార్చకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా.. అన్నది తేలాల్సి ఉంది. మౌఖిక ఆదేశాలు నిజంగా వచ్చాయా.. లేకపోతే వచ్చాయని చెబుతున్నారా.. ఒకవేళ నిజంగానే స్కూల్‌ను చెన్నూర్ నుంచి తరలించొద్దని ఉన్నతాధికారులు చెప్పి ఉంటే, దానికి సంబంధించి ఉత్తర్వులు సైతం ఉండాలి కదా.. సమస్యలున్నాయని మార్చమని ఉత్తర్వులు ఇచ్చిన అధికారే, స్కూల్ బిల్డింగ్‌ను మార్చొద్దని ఎలా చెబుతారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకొర వసతులు, సమస్యల మధ్య మైనార్టీ గురుకుల పాఠశాల నిర్వహిస్తే రానున్న రోజుల్లో విద్యార్థునులకు ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు. ఓరల్‌గా చెప్పిన టీజీఎంఆర్ఈఐఎస్ అధికారి తీసుకుంటారా.. ఆర్ఎల్సీ తీసుకుంటారా.. డీఎండబ్లూవో బాధ్యత తీసుకుంటారా.. అన్న స్పష్టత రావాల్సి ఉన్నది.
పాఠశాల నిర్వహణకు ఆ భవనమే పనికిరాదని చెప్పిన అధికారులే, మందమర్రికి స్కూల్‌ను తరలించకుండా ఎందుకు ఆడ్డుకుంటున్నారు అన్నది తేలాల్సి ఉంది. ఇక జిల్లాలో ఆర్ఎల్సీ తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనల పేరుతో ఇష్టారాజ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్‌ను తొలగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అర్హులను కాదని జూనియరైన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించడంపై రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు, సీనియర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా.. వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో తనకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు మీటింగ్ పేరుతో ప్రిన్సిపాళ్లను పిలిపించుకొని, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను మేమే తొలగించామని, ఇందులో ఆర్ఎల్సీ ప్రమేయం ఏమీ లేదని బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటూ పలువురు ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. ఆర్ఎల్సీ తీసుకున్న నిర్ణయాలకు రేపు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రిన్సిపాళ్లను బలిపశువులు చేసేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని సమగ్ర విచారణ చేయాలన్న డిమాండ్ సైతం మైనార్టీ గురుకుల పాఠశాల ఉద్యోగులు, సిబ్బంది కోరుకుంటున్నారు.