సమైక్య రాష్ట్రంలో పరాయి పాలకుల చేతిలో అణచివేతకు గురైన గౌడ కులస్తులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బుధవారం నిర్వహించిన మంచిర్యాల-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల గౌడ బాంధవ్య ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలోనే గౌడన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో గౌడ సంఘ భవనం నిర్మిస్తామని, హైదరాబాద్ తరహాలో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తామని, రేణుకా ఎల్లమ్మ గుడులకు నిధులు, అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తానని వరాలు కురిపించారు. ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు సుమన్ అని, అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలని సూచించారు. ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలువగానే నేనున్నా అని ముందుంటున్న నాయకుడిని మరోసారి గెలిపించుకోవాలని కోరారు. కాగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్వంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి కూడా విప్ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు.
మంచిర్యాల, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో పరాయి పాలకుల చేతిలో అణచివేతకు గురైన గౌడ కులస్తులకు స్వరాష్ట్రం వచ్చాక సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర క్రీడ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బుధవారం నిర్వహించిన మంచిర్యాల- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల గౌడ బాంధవ్య ఆత్మీయ సమ్మేళననానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాక ముందు మన వృత్తి ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. స్వరాష్ట్రంలోనే గౌడల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, గౌరవం పెరిగిందన్నారు. సమైక్య పాలకులు తెలంగాణలో గౌడ కులస్తులు కల్లు అమ్మి పైసలు సంపాదిస్తున్నారని, జనాలతో వీళ్లకు మంచి సంబంధాలున్నాయని, ఈ గౌడ్లు చెబితే పది మంది వింటున్నారని, వీళ్లు మరింత బలపడితే మనకు ప్రమాదమని నాటి నాయకులు మనపై కక్ష కట్టారన్నారు.
దాదాపు 15 రోగాలకు ఔషధంగా పని చేసే కల్లు కలుషితం అవుతుందంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కల్లు దుకాణాలన్నింటినీ మూసివేశారన్నారు. చెట్లపై పన్నులు వసూలు చేసి కట్టని గౌడన్నలపై కేసులు పెట్టారన్నారు. ఒక గౌడ్లకే కాకుండా రాష్ట్రంలోని అన్ని కులాలు భయంతో బతికేలా చేసి, కులవృత్తులన్నింటినీ నాశనం చేశారన్నారు. ఉద్యమ నాయకుడిగా ఈ పరిస్థితిని చూసిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలో వస్తే మూసేసిన కల్లు దుకాణాలన్నింటినీ తెరుస్తామని చెప్పారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2014లో అధికారంలోకి రాగానే మూసేసిన కల్లు దుకాణాలన్నింటినీ తెరిపించారన్నారు. కల్లుగీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసి, రూ.5లక్షల ప్రమాద బీమా ఇచ్చి, వయసు మీద పడిన కార్మికులకు ఆసరా పింఛన్ ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా వైన్స్ షాపులు నిర్వహించడం గౌడన్నల కులవృత్తి అని ప్రకటించి, వైన్స్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
నీరా పాలసీతో గౌడన్నల జీవితాల్లో వెలుగులు..
దేశం కనీవినీ ఎరుగని నీరా పాలసీని తీసుకొచ్చి కులవృత్తినే నమ్ముకొని బతికే గౌడన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. నీరా అమ్మాలన్నా, నీరా గీయాలన్నా గౌడన్నలే చేయాలనే జీవో ఇచ్చిన గొప్పమనసున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన రూ.12 కోట్లతో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. హెల్త్ డ్రింక్‌గా పేరొందిన నీరాకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. ప్రతి రోజూ ఆ కేఫ్‌కు బెంజ్ కార్లు వస్తున్నాయని, సినిమా నటులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, చదువుకునే పిల్లలు వస్తున్నారని పేర్కొన్నారు. ఎంత స్టాక్ తెచ్చినా మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరా బాటిల్స్ అయిపోతున్నాయన్నారు. ఉదయం 10 గంటలకు కేఫ్ తెరుస్తారంటే 9 గంటల నుంచే లైన్లు కడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ర్టాల నుంచి వచ్చి మరి మన నీరా తాగిపోతున్నారన్నారు.
అతి త్వరలో గౌడ సంఘ భవనం..
మంచిర్యాల జిల్లాలో గౌడ సంఘ భవనం నిర్మించుకునేందుకు సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ తరహాలో మంచిర్యాల జిల్లాలో నీరా కేఫ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నాటికి కచ్చితంగా ఇక్కడ నీరా కేఫ్ వస్తుందన్నారు. గ్రామాల్లో రేణుక ఎల్లమ్మ దేవాలయాల రిపేరింగ్, కొత్త దేవాలయాల నిర్మాణానికి, ఆ ఆలయాలకు వెళ్లేందుకు అప్రోచ్‌రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కచ్చితంగా ఇది సాకారం చేసేందుకు బాల్క సుమన్, తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కల్లు గీసుకునేందుకు గౌడన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతామన్నారు.
ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు సుమన్
చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజకీయాల నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు కాదన్నారు. ఉద్యమం నుంచి, కష్టాల నుంచి వచ్చిన నాయకుడని, కష్టపడే వారి విలువ ఆయనకు తెలుసునన్నారు. తెలంగాణ కోసం ఏ స్ఫూర్తితో పోరాటం చేశారో.. అదే స్ఫూర్తితో చెన్నూర్ నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. యువనాయకుడు సుమన్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఏ కష్టం వచ్చినా ‘అన్నా’ అని పిలవగానే నేనున్నా అని ముందుంటున్న నాయకుడిని మనం మరోసారి గెలిపించుకోవాలన్నారు. అతి తక్కువ కాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పదవులు పొందిన ఆయన రానున్న రోజుల్లో మరింత గొప్పస్థాయికి ఎదుగుతారన్నారు. గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే అధికంగా ఇచ్చి గెలిపించుకుంటే ఆయనకు ప్రభుత్వంలో సమున్నత గౌరవం దక్కుతుందన్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు ఇచ్చిన నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. రాత్రి మహారాష్ట్రలో ఉంటే తెల్లారే సరికి మళ్లీ చెన్నూర్లోనో, హైదరాబాద్‌లోనో ఉంటారన్నారు. అలాంటి నాయకుడిని మనమంతా కాపాడుకోవాలన్నారు.
గౌడన్నలంటే నాలో సగం : విప్ బాల్క సుమన్
గౌడన్నంటే నాలో సగమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మీ తరఫున ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడన్నల కోసం చాలా పనులు జరిగాయన్నారు. ఎప్పుడు మీ కోసం ఏది అడిగిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాదనకుండా చేసి పెట్టారన్నారు. రానున్న రోజుల్లోనూ ఏ కష్టం వచ్చినా మీ వెంటే మేము ఉంటామన్నారు. మంచిర్యాల జిల్లా గౌడన్నల తరఫున జిల్లాలో గౌడసంఘ భవనం కావాలని, నీరా కేఫ్ ఏర్పాటు చేయాలని, రేణుక ఎల్లమ్య గుడులు బాగుచేసుకునేందుకు, రోడ్లు వేసుకునేందుకు నిధులు కావాలని అడిగారు. టీఎస్టీటీసీఎఫ్సీఎల్ చైర్మన్ పల్లెరవి, శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్‌గౌడ్, రెండు జిల్లాల గౌడ సంఘాల నాయకులు సమ్మేళనంలో పాల్గొన్నారు.
అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అమోఘం
హాజీపూర్, మే 24 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్వంలో బుధవారం నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో ఒక్క పిలుపుతో సకల జనుల సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారని, రాష్ట్ర సాధనలో ముందంజలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే కరెంట్ ఉండదని, తీగలపై బట్టలు వేసుకోవాలని మాట్లాడిన సీమాంధ్ర నాయకులకు రాష్ట్ర అభివృద్ధి చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కువగా జీతాలు తీసుకుంటున్నవారు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ఉద్యోగులే అన్నారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందంటే ఉద్యోగులు, నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి పరిష్కరిస్తున్నారని, మిగిలిన సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి బసంత్‌నగర్ వెళ్లేందుకు మంచిర్యాల గోదావరిపై నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి, హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అనంతరం చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పట్టణాలు, గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎక్కడా లేని విధంగా కుల, మత విబేధాలు లేకుండా అనేక రకాల సంక్షేమ పథకాలను విభిన్న వర్గాల ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల సహకారంతో రాష్ట్రం దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందన్నారు. జూన్ 2వ తేదీ నుంచి నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అబివృద్ధి దశలో దూసుకపోతుంటే పనీపాటా లేని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వారికి అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అంతక ముందు మంత్రి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం వివిధ ఉద్యోగ సం ఘాల నాయకులు మంత్రి, విప్‌ను పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, పల్లె రవికుమార్, ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, టీఎన్జీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి మారం జగదీశ్, అధికారుల సంఘం అధ్యక్షుడు శేషాద్రి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, అటవీశాఖ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు.