ఎదులాపురం, జనవరి 12 : దొంగిలించిన బైక్‌పై వచ్చి రాత్రి ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ.. అలారం మోగడం, పోలీసులు వెంటపడడంతో పారిపోయాడు. కాగా, పోలీసులు ఈ కేసుపై పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తుంటే తాజాగా బుధరాత్రి మరో ఏటీఎం దొంగతనం చేసేందుకు రాగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో పట్టణంలోని కైలాస్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఎజాజ్ చోరీకి వచ్చాడు.
ఇతను స్థానిక విరాజ్ రెస్టారెంట్ ఆవరణలో ఉన్న ఒక బైక్‌ను దొంగిలించి దానిపైనే ఈ ఏటీఎం చోరీకి వచ్చాడు. ఆ సమయంలో సైరన్ మోగడంతో మేనేజర్ అప్రమత్తమై 100కు డయల్ చేశాడు. దీంతో నిమిషాల్లోనే పోలీసులు ఆ ఏటీఎం వద్దకు వెళ్లగా.. ఎజాజ్ పారిపోయాడు. అయినా పోలీసులు వెంబడించగా, తప్పించుకున్నాడు. కాగా, సదరు దొంగ మహారాష్ట్ర కిన్వట్ పారిపోయి దొంగతనం చేసిన వాహనాన్ని అమ్మడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తిరిగి ఈ నెల 11న రాత్రి ఇదే బైక్‌పై ఆదిలాబాద్ వచ్చి తెల్లవారుజామున ఆదిలాబాద్ కన్యాకాపరమేశ్వరి ఆలయ సమీప ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించాడు. ఏటీఎం మిషన్‌ను పగులగొట్టాడు. ఇంతలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఎజాజ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో వివిధ కేసులున్నాయి. ఎజాజ్‌పై రెండు ఏటీఎంలలో చోరీకి యత్నం, ద్విచక్ర వాహనం దొంగతనం కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ కే సత్యనారాయణ, ఎస్ఐలు నారాయణ, హరిబాబు, అశోక్, అంజమ్మ పాల్గొన్నారు.