భైంసా, ఏప్రిల్ 14 : నిర్మల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవీ కాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్‌లో పాలక వర్గాలను రద్దు చేసింది. అప్పటి నుంచి పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జీలను నియమించింది. ఆరు నెలలుగా పర్సన్ ఇన్చార్జీల పాలనే సాగుతుండగా.. పాలకవర్గాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలని యోచించింది. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదన కూడా అటకెక్కినట్లు తెలుస్తున్నది. పర్సన్ ఇన్‌చార్జీలతోనే పాలన కొనసాగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలను నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతున్నది.
నిర్మల్ జిల్లాలో 17 పీఏసీఎస్‌లు సేవలు అందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వడంతోపాటు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పని చేస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్గేజ్ రుణాలు, వ్యవసాయాంత్రీకరణకు రుణాలు, పశుపోషణకు రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. అన్ని పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు, అధికంగా ఉండడంతో రైతులు పీఏసీఎస్‌లోనే కొంటున్నారు. యూరియా 90 శాతం మేర సొసైటీల నుంచి రైతులకు అందుతున్నది. అంతేగాకుండా రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జిలుగు విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. తద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. అయితే పలువురు ఆశావహులు స్పష్టత లేక ఆందోళన చేస్తున్నారు.