కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో అన్నింటా వెనుకబడిన గిరిజన నియోజకవర్గం ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. పాలకుల పట్టింపులేని తనంతో దశాబ్దాల పాటు చీకట్లో మగ్గగా, నేడు కుమ్రం భీం స్ఫూర్తితో పరుగులు పెడుతూ అన్ని రంగాల్లో వెలుగొందుతున్నది. మెరుగైన విద్య, వైద్యం, రవాణా వసతి అందుబాటులోకి రావడంతో పాటు ఇంటింటికీ తాగు నీరు, గడప గడపకూ సంక్షేమ పథకాలు చేరుతుండగా, ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దాదాపు 90 శాతం గిరిజన గ్రామాలే. భీం పోరాట స్ఫూర్తితో జోడెఘాట్‌లో రూ. 25 కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి.. పల్లె పల్లెకూ చేరింది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ. 88.97 కోట్లతో 108 గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించింది. రూ. 105 కోట్లతో 24 హైలెవల్ వంతెనలు నిర్మించింది. నియోజకవర్గంలో 6 చెక్‌డ్యామ్‌లు నిర్మించి సాగు నీరందిస్తున్నది. వాంకిడి మండలం సంకెపల్లి వాగుపై రూ. 3.33 కోట్లతో, ఆసిఫాబాద్ మండలం కెస్లాపూర్ వాగుపై రూ. 4.65 కోట్లతో, ఖమానా వాగుపై రూ. 3.52 కోట్లతో, వాంకిడి వాగుపై రూ. 3.33 కోట్లతో, గంగాపూర్ వాగుపై రూ. 5.77 కోట్లతో, రామగూడ వాగుపై రూ. 2.50 కోట్లతో చెక్‌డ్యామ్‌లను నిర్మించగా, సుమారు 700 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
నియోజకవర్గంలో గత పదేళ్లలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఆసిఫాబాద్‌లో రూ. 100 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా కేంద్రంలోని పీహెచ్‌సీని రూ. 7 కోట్లతో ఆధునీకరించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా ఉన్నతీకరించింది. జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేసింది. రూ. 54 కోట్లతో 300 పడకల ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని జైనూర్, తిర్యాణి, కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నతీకరించింది.
ప్రభుత్వం సంక్షేమ పథకాలతో నిరుపేదలకు భరోసానిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా నియోజకవర్గంలో రూ.90 కోట్ల 45 లక్షల 44 వేల 704 అందించింది. సీఎంరిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 62 లక్షల 92 వేల 500 అందించింది. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు 224 మందికి రూ.11 కోట్ల 20 లక్షలు అందించింది. రైతుబంధు ద్వారా 47 వేల 36 మంది రైతులకు ఏడాదికి రెండు పంటలకు రూ. 152 కోట్లు అందిస్తున్నది. నియోజకవర్గంలో 100 మంది దళితులకు ‘దళితబంధు’ పథకం ద్వారా రూ. 10 కోట్లు అందించింది. నిరుపేదలు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 1100 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది.
సాధారణ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చడంతో కొత్త రూపు వస్తున్నది. దీంతో జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే రూర్బన్ పథకం ద్వారా సుమారు రూ. కోటితో వివిధ పనులు చేపట్టారు. సుమారు రూ. 30 కోట్లతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు జిల్లాకే వన్నెతెస్తున్నాయి.