రామకృష్ణాపూర్, మార్చి 25: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా నమోదైన కేసులో న్యాయస్థానం తీర్పు మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరుకాగా బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, కుర్మ దినేశ్, మహేందర్, బెల్లం అరుణ్, సీపెల్లి సాగర్, ఆర్నే సమ్మయ్య, మద్ది శంకర్, కొంగల తిరుపతిరెడ్డి సుదర్శన్ సంతకం వచ్చి సంతకం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఫిబ్రవరి 16న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేకానంద వందల మంది పోలీసు బలగాలను దింపి పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచిన బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు రాకుండా అడ్డుకున్నారని, మరుసటి రోజు కూడా అడ్డుకున్నప్పటికీ కౌన్సిలర్లు హాల్‌కు వచ్చారని తెలిపారు. ఎక్స్అఫీషియో ఓటు వేసేందుకని వచ్చిన మంత్రి వివేకానంద, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కనుసైగలతోనే కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లపైకి దాడికి ఉసిగొల్పారని, మహిళా కౌన్సిలర్ల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి గొడవ చేయించారని, దీంతో ఎన్నిక వాయిదా వేయించారని ఆరోపించారు.
రైల్వే ైఫ్లై ఓవర్ బ్రిడ్జివద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు రాళ్లు వేయడం, పోలీసులు లాఠీచార్జి చేయడం, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ చెన్నూరు ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్‌తో పాటు తనతో పాటు 25 మందిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని ఈ నెల 24 వరకూ ఇచ్చిన హైకోర్టు గడువు కూడా ముగిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేఖాతర్ చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్నిక నిర్వహించకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించనున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కోర్టు తీర్పును గౌరవించి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసినట్లు తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, కుర్మ దినేశ్, కోవ లక్ష్మి, మహేందర్, బెల్లం అరుణ్, సీపెల్లి సాగర్, ఆర్నే సమ్మయ్య, మద్ది శంకర్, కొంగల తిరుపతిరెడ్డి, సుదర్శన్, రామిడి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్ పాల్గొన్నారు.