ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 18: వచ్చే వానకాలంలోగా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వంతెనను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణం కోసం గత సర్కారులో రూ.8.50 కోట్లు మంజూరయ్యాయని, కాంట్రాక్టర్ అలసత్వం వల్ల పనులు పూర్తికాలేదన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీళ్లు ఈ వంతెన పై నుంచి వెళ్లడంతో దెబ్బతిన్నదని, రీడిజైన్ కోసం రూ. 14 కోట్ల నిధులు అవసరమన్నారు. కొన్ని నెలల క్రితం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక గుండి గ్రామాన్ని సందర్శించారని, త్వరితగతిన నిధులు మంజూరు చేసి వంతెన పూర్తి చేయాలన్నారు.
లక్మాపూర్ వంతెన నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, ఈ రోడ్డు గుండా మంత్రి సీతక కూడా ప్రయాణించారని, రోడ్డు పరిస్థితి గురించి ఆమెకు తెలుసని, వెంటనే నిధులు మంజూరు చేసి బాగు చేయాలని కోరారు. అలాగే కెరమెరిఘాట్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకడ రోడ్డు వెడల్పు కోసం అటవీశాఖ ద్వారా అనుమతులు వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.