కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ ముదురుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన శ్యాం నాయక్-జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌కు మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదం చెలరేగుతున్నది. నిత్యం ఇరువర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. గత నవంబర్ 2న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో శ్యాంనాయక్‌కు సమాచారమివ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఆయన వర్గీయులు ప్రశ్నించగా, మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటనతో ప్రారంభమైన వివాదం రోజురోజుకూ ముదిరి కేసులు సైతం పెట్టుకునే స్థాయికి వెళ్లింది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్రావుతో పాటు అతని వర్గానికి చెందిన మరికొంత మంది నాయకులపై నియోజకవర్గc చేసిన ఫి ర్యాదు మేరకు ఇటీవల పోలీసులు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరోసారి వివాదం చెలరేగింది. శ్యాంనాయక్ వర్గీయులు.. దాడిచేసినట్లుగా ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వప్రసాద్ ఒక్కరేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఏళ్లకేళ్లు డీసీసీ పదవిని తనదగ్గరే ఉంచుకొని పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని నియోజకవర్గం ఇన్చార్జి శ్యాంనాయక్ ఆరోపిస్తున్నారు. విశ్వప్రసాద్ ఒంటెద్దుపోకడల వల్లే జిల్లాలో పార్టీ అన్ని విధాలా నష్టపోతుందని, గత అసెం బ్లీ ఎన్నికల్లో ఆయన ఇతర పార్టీతో కుమ్మక్కవ్వడం వల్లే సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి చెందిందని, బేసిక్‌గా కాంట్రాక్టర్ అయిన విశ్వ ప్రసాదర్రావు జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తూ కిందిస్థాయి కార్యకర్తలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నార ని శ్యాంనాయక్ ఆరోపిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్యాంనాయక్ చేస్తున్న ఆరోపణలపై డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ వర్గం నాయకులు మండిపడుతున్నారు. శ్యాంనాయక్ చేసిన ఆరోపణలపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్పందించారు. పార్టీకి నష్టం చేసేవిధంగా శ్యాంనాయక్ వ్యవహార శైలి ఉంటుందని ఆరోపించారు. సొంత పార్టీనాయకులపై కేసులు పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ముదురుతున్న పంచాయితీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల నేతలను హైదరాబాద్ పిలిపించుకున్నట్లు తెలిసింది.