రెబ్బెన, ఫిబ్రవరి 1 : విద్యార్థినులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగాపూర్ గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై ఎన్జీవో సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే ఆరోగ్య కార్యకర్తకు సమాచారమివ్వాలని సూచించారు. రెడ్ ఎక్స్ప్రెస్ సంస్థ ప్రతినిధి భాను కల్లకూరి, మహిళా శిశు సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, మహి ళా సాధికారిక జిల్లా కో ఆర్డినేటర్ శారద, ఎస్వో పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పేర్కొన్నారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
అనంతరం గంగాపూర్ వెళ్లి బాలాజీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్తివారీ, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావు, బెల్లంపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీఎంహెచ్వో సీతారం, డీపీవో భిక్షపతి, డీఎల్పీవో ఉమర్ఉస్సేన్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ చంద్రశేఖర్, ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.