చింతలమానేపల్లి, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద నిర్మాణ పనులు విద్యా సంవత్సరం ప్రారంభమైనా పూర్తి చేయపోవడంపై సంబంధిత అధికారులపై కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పర్యటించారు. ప్రైమరీ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడం ఏమిటని, పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. వాష్ బేసిన్ నిరుపయోగంగా మారి పిచ్చి మొక్కలు మొలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రత్యేక అధికారి వెంటనే నివేదిక ఇవ్వాలని, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని ఎంపీడీవో ప్రసాద్ కోరగా నిర్మాణ పనులు పూర్తయ్యాకే వస్తానని కలెక్టర్ అన్నారు. బారెగూడకు వెళ్లే రోడ్డు బురదమయంగా మారిందని గ్రామస్తులు విన్నవించగా మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పునరావాసం కల్పించాలని బారెగూడ, ధరంపల్లి గ్రామస్తులు కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మునావర్ షరీఫ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
బెజ్జూర్, ఆగస్టు 21 : మండల కేంద్రంతో పాటు బారెగూడ, పోతెపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులు, సిబ్బందితో పాటు డీఎంహెచ్‌వో తుకారాంను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బెజ్జూర్ శివారులోని సర్వే నం. 761, 762 లోని రైతులకు పట్టా పాస్‌పుస్తకాలు ఇప్పించాలని, సహకార బ్యాంకులో రుణమాఫీలో గందరగోళం జరిగిందని కలెక్టర్‌కు రైతులు విన్నవించారు. హెల్త్ సీఈవో రాదండి లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్, ఎంపీడీవో గౌరీ శంకర్, వైద్యాధికారి అవినాష్ ఆయా సిబ్బంది ఉన్నారు.