దిలావర్పూర్, మార్చి 29 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు యేటా రెండు విడుతల్లో రైతులకు ఇచ్చే రైతుబంధు మాదిరిగానే రూ.12 వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారుల పేర్లను ప్రకటించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2023-24 సంవత్సరంలో 20 రోజులపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారిని అర్హులుగా గుర్తించి, వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. అత్మీయ భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి అర్హులను గుర్తించారు.
భారీగా దరఖాస్తులు
అత్మీయ భరోసా పథకానికి నిర్మల్ జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో 29,306 దరఖాస్తులు రాగా.. 1860 వివిధ కారణాలతో కోట్టి వేశారు. జిల్లా వ్యాప్తంగా 27,446 అర్హులుగా గుర్తించడంతోపాటు లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించారు. రెండోసారి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించగా.. 9,734 దరఖాస్తులు రాగా వివిధ కారణాలతో 8,491 మంది దరఖాస్తులను రద్దు చేశారు.
అందులో నుంచి 1242 మందిని అర్హులుగా గుర్తించారు. నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం 28,686 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. జాబ్‌కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాత, ఫోన్ నంబర్‌తోపాటు గుర్తింపు పొందిన లబ్ధిదారుడు 2023-24 సంవత్సరంలో 20 రోజులు కూలీ పనికి వెళ్లాడా అని పరిశీలించడంతోపాటు ధరణిలో లబ్ధిదారుడికి ఒక్క గుంట భూమి కూడా లేకపోతే అర్హులుగా ఎంపిక చేశారు.
పైలెట్ గ్రామాలకు ఇచ్చి చేతులు దులుపుకున్న సర్కారు..
ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని ప్ర భుత్వం ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలో ప్రతి మండలంలోని ఒక చిన్న గ్రామాన్ని పై లెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ ఎంపికైన గ్రామాల్లోని లబ్ధిదారుల నుంచి గ్రామసభలు ఏర్పాటు చేసి గుర్తింపు పత్రాలు తీసుకున్నారు. ఆ తరువాత వారం రోజులకు ల బ్ధిదారుల ఖాతాల్లో రూ.6 వేలు జమ అ య్యాయి. మిగతా గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సర్కారు భరోసా ఇవ్వలేక పోయింది.
పైసల్ ఇస్తామంటే సంబురపడ్డం..
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెసోళ్లు భూమి ఉన్నోళ్లకు రైతుబంధు.. లేనోళ్లకు ఆత్మీయ భరోసా కింద పైసలిస్తామంటే సంబురపడ్డం. ఇగ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామ సభలో నా పేరు వచ్చిందని సంతోషించా. నా పేరుతో పాటు మా గ్రామంలోని మరి కొందరు పేర్లను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుపై అతికించారు. మా ఇంటికొచ్చి ఆధార్, జాబ్, బ్యాంక్ అకౌంట్ పరిశీలించారు. మూడు రోజుల్లో నీకు బ్యాంకులో రూ.6 వేలు పడుతాయని చెప్పిండ్రు. 300 రోజులు అవుతున్న రూ.300 కూడా రాలేదు. అనేక సార్లు అధికారుల వద్దకు వెళ్లి అడిగా. పేరు వచ్చిందని సంబుపడ్డ తప్ప నాకు రూపాయి రాలే. ప్రభుత్వం భూమి లేని మా పేద కుటుంబాలకు వెంటనే ఈ పథకం ద్వారా డబ్బులు ఇయ్యాలి. – గంగవ్వ, ఉపాధి హామీ కూలీ, అత్మీయ భరోసా లబ్ధిదారు
