హాజీపూర్, నవంబర్ 15 : మండలంలోని ఎంసీసీ క్వారీలోగల అటవీ అందాలను వీక్షించేందుకు అధికారులు సఫారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, వన్యప్రాణులు, దట్టమైన అటవీ ప్రాంతాన్ని తిలకించేందుకు దాదాపు 29 కిలో మీటర్ల మేర రైడ్‌కు అన్నీ సిద్ధం చేస్తున్నారు. క్వారీలోని క్రషర్ వద్ద సఫారీ ప్రారంభమవుతుంది. గాంధారీ ఖిల్లా, సల్పాల వాగు, కండి, ఇప్పచెట్టు, మంచ, నాగారం రోడ్డు, క్వారీ వెనుక నుంచి అందాలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు 20 కిలో మీటర్ల మేర పలు చారిత్రాత్మక ప్రాంతాలు, వన్యప్రాణులు, అటవీ అందాలను రెండు నుంచి మూడు గంటలు వీక్షించే అవకాశమున్నది. అడవి మధ్యలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, నీటి కుంటలు, మంచెలు, వాచ్టవర్లు, చూపరులను ఆకట్టుకుంటాయి. గడ్డి మైదానాల్లో జింక పిల్లల ఆటలు, మయూరాల నాట్యాలు, పక్షుల కిల కిల రావాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి.
శరవేగంగా పనులు
జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఎంసీసీ క్వారీలో జంగల్ సఫారీకి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వన్యప్రాణులకు తాగు నీరందించేందుకు రూ. 12 లక్షలతో అక్కడక్కడా కుంటలను ఏర్పాటు చేసి, క్వారీలోని కుంట నుంచి సోలార్ పంపుసెట్ల ద్వారా నీటిని తరలిస్తూ వాటిని నింపుతున్నారు. 29 కిలో మీటర్లలో దాదాపు ఐదు కుంటలు, ఐదు మంచెలను ఏర్పాటు చేశారు. నీటి కుంటల పక్క నుంచి సఫారీ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరో రూ. 12 లక్షలతో 20 కిలో మీటర్లు ప్రయాణించేందుకుగాను 24 మీటర్ల వెడల్పుతో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. 14 ఫీట్ల వెడల్పుతో సఫారీ వాహనం వెళ్లేందుకు వీలుగా భూమి చదును చేస్తున్నారు. అడవిలో నెమళ్లు, కుందేళ్లు, రేస్ కుక్కలు, దుప్పులు, జింకలు, మెకాలు, తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చిరుత పులులు, పెద్దపులులతో పాటు వివిధ రకాల పక్షులున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
అటవీ అందాలను చూపించే లక్ష్యంతోనే..
జిల్లా ప్రజలకు అటవీ అందాలను చూపించాలనే లక్ష్యంతో ఎంసీసీ క్వారీలో జంగల్ సఫారీ పనులకు శ్రీకారం చుట్టాం. జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్ పార్ట్‌లో భాగంగా జంగల్ సఫారీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో బొక్కలగుట్ట బీట్, తిమ్మాపూర్ బీట్, పాత మంచిర్యాల బీట్లను కలుపుతూ జంగల్ సఫారీ రూట్‌ను ఏర్పాటు చేస్తాం. త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హతవుల్లా, బీట్ ఆఫీసర్లు రాజేందర్, సంతోష్ పనులను శ్రద్ధతో చేపిస్తున్నారు.
– అత్తె సుభాష్, ఫారెస్టు రేంజ్ అధికారి, లక్షెట్టపేట