ఎదులాపురం, ఫిబ్రవరి21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో ఐదవ తరగతిలో, ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే ప్రవేశ పరీక్ష(టీజీసెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ఎం. లలిత కుమారి తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఎస్సీ గురుకులంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఐదవ తరగతిలో ప్రవేశానికి, 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 4193 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందన్నారు.
పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు, పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్నులు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఆధార్‌కార్డులో పేర్లు తప్పుగా ఉన్నట్లయితే బోనాఫైడ్ జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రానికి ఒక అధికారిని నియమించినట్లు తెలిపారు.