ఎదులాపురం, జనవరి 23 : ప్రజావాణిలో వచ్చే అర్జీలను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సంబంధ సమస్యలు, పింఛన్ మంజూరు, పట్టాలు, ప్రభుత్వ భూముల్లో అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు, వ్యక్తిగత సమస్యలు, ఉపాధి, తదితరాలపై అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన సమస్యలు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పింఛన్లకు సంబంధించిన సమస్యలను జిల్లా గ్రామీణాభివృద్ధి ఏపీవోను సంప్రదించి, సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం జంతు సంక్షేమానికి పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చారిర్రిజ డీఆర్వో అరవింద్ కుమార్, డీఎస్వో కిరణ్ కుమార్, పశు సంవర్ధక శాఖ అధికారి కిషన్, డీఐసీ జీఎం పద్మభూషణ్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎల్డీఎం ప్రసాద్, డీపీఆర్వో ఎన్ భీమ్ కుమార్, ఏపీవో శేషారావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్లో అదనపు కలెక్టర్..
నిర్మల్ టౌన్, జనవరి 23 : నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వర్రావు, జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.