ఎదులాపురం, మే 19 : ఆదిలాబాద్ జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించి ఆహ్వానించారు. మొదటగా పోలీసు ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించి, సిబ్బంది, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ(పర్సనల్) మాట్లాడుతూ.. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో పెండింగ్ లేకుండా కార్యాలయ ఫైల్స్‌ను నవీకరిస్తూ ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టే విధంగా కచ్ఛితమైన ప్రణాళికను అవలంబించాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న, ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల సమస్యలను, జిల్లాలో నూతనంగా అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.