కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కౌటాల, అక్టోబరు 14 : కరెంట్ కోతలపై మిర్చి రైతులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. సోమవారం కౌటాల మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట గుండాయి సబ్‌స్టేషన్ పరిధిలోని తాటిపల్లి, గుండాయిపేట్, గుడ్లబోరి, మొగఢ్దగఢ్ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ధర్నా దిగారు. ఆపై మార్కెట్ ఏరియాలోని ప్రధాన రహదారిపైకి చేరుకొని మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సర్కారు, విద్యుత్‌శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి రోజూ కరెంట్ కోతలు విధించడం వల్ల మిర్చి తోటలు ఎండిపోతున్నాయని, లో ఓల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయంటూ మండిపడ్డారు. గుండాయిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో బూస్టర్ చెడిపోయి ఏడాది కావస్తున్నా మరమ్మతులు చేయడం లేదని, అప్పులు చేసి పంటలు వేశామని, అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండ్లకు సరఫరా చేసే కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉందని, దోమల బెడద ఎక్కువై అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారన్నారు. ధర్నాతో సిర్పూర్-బెజ్జూర్ వైపు దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు.
విద్యుత్ అధికారుల నుంచి లిఖిత పూర్వకంగా హామీ పత్రం రాసిస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టం చేశారు. చివరకు ఏఈ రవీందర్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం సమస్య పరిష్కరిస్తామని ఆయన వాట్సప్ ద్వారా మెస్సేజ్ పంపడంతో రైతులు ధర్నా విరమించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌కు వచ్చిన విర్దండి, తుమ్డిహట్టి, పార్డీ, బాలెపల్లి తదితర గ్రామాల రైతులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు ధర్నాకు మద్దతు పలికారు.