నిర్మల్ చైన్గేట్, జూన్ 20 : గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పట్టి పీడిస్తోంది. ఫలితంగా నిర్మల్ జిల్లాలో మహిళలకు పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల నియామకాన్ని చేపడతామంటూ ప్రకటనలు ఇస్తూ కాలం వెల్లదీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నియామకాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్, భైంసా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 926 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో మొత్తం 93 టీచర్, 385 హెల్పర్ పోస్టులు ఖాళీలున్నాయి. నియామకాలు చేపట్టకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల టీచర్లు ఉంటే సహాయకులు లేరు. సహాయకులుంటే టీచర్లు లేరు.
కొన్ని చోట్ల ఇద్దరు లేకపోవడంతో సమీపంలోని కేంద్రాల సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యకు దూరం అవుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.