బేల, డిసెంబర్ 21 : ఖాతాలోని డబ్బులను బ్యాంకు అధికారులు కాజేసిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మనియార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ యేడాది ఆగస్టు 28వ తేదీన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.50 వేలు డ్రా చేసేందుకు విత్ డ్రా ఫాం రాసి ఇచ్చాడు. దాంతో రూ.20 వేలు మాత్రమే ఇస్తామని మరో విత్ డ్రా ఫాం రాయమని బ్యాంక్ సిబ్బంది సూచించారు.
దాంతో రూ.20 వేలకు ఫాం రాసి ఇచ్చాడు. కానీ.. ముందుగా రూ.50 వేల కోసం రాసి ఇచ్చిన మరో విత్ డ్రా ఫాం తిరిగి ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నారు. ఇటీవల మళ్లీ రూ.50 వేల కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని తెలుపడంతో నా ఖాతాలో డబ్బులు ఎటు పోయానని అరా తీశాడు. బ్యాంక్ స్టేట్మెంట్లో ఒకే తేదీన డబ్బులు విత్ డ్రా చేసినట్లు చూపించింది.
దీనిపై రైతు బ్యాంక్ అధికారులను సమాధానం అడగగా.. తమకేమి తెలియదని సమాధానం దాట వేశారని తెలిపారు. బ్యాంక్ అధికారులే తనకు అన్యాయం చేశారని శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా.. ఒకే తేదీపై విత్ డ్రా అవడం వాస్తవమేనని.. కానీ డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని, సీసీ కెమెరాలు చూసిన తర్వాతనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బ్యాంక్ అధికారులు తెలిపారు.