మందమర్రి, జూన్ 22 : పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు గానూ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇంతలోనే శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇండ్ల పంపిణీలో మరింత జాప్యం జరిగింది. అయితే రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మద్యం ప్రియులు, పోకిరీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అడ్డాలుగా మారాయి. ఇండ్లకు అమర్చిన విద్యుత్ తీగలు, స్విచ్ బోర్డులు, కిటికీల అద్దాలను దుండుగులు ధ్వంసం చేశారు. వాటికి మరమ్మతులు చేయకుండానే ఇండ్లు కేటాయించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మందమర్రి మున్సిపాలిటీ పరిధి ప్రాణహిత కాలనీ సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం 560 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. నిర్మాణం పూర్తి కావడంతో సర్వేలు నిర్వహించి, లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో 2023, అక్టోబర్ 1న అప్పటి రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు.
ఇంతలోనే శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇండ్ల పంపిణీలో మరింత జాప్యం జరిగింది. అయితే రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో విద్యుత్ తీగలు, స్విచ్ బోర్డులు, కిటికీల అద్దాలను దుండుగులు ధ్వంసం చేశారు.
కొన్ని ఇండ్లలో విద్యుత్ బోర్డులతోపాటు, తాగునీటి సరఫరా పైపులు, సెఫ్టిక్ ట్యాంకుల పైపులను ఎత్తుకెళ్లారు. వాటికి మరమ్మతులు చేపట్టకుండానే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గత జనవరిలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు 243 ఇండ్లను అధికారులు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. పంపిణీ సమయంలో కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలోని పేర్లను తొలగించి, తమకు అనుకూలమైన అనర్హుల పేర్లను చేర్చారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
అధికారులు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేటాయింపు అనంతరం ఇండ్లను పరిశీలించిన లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు నిరాసక్తత వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో పాటు, స్థానిక అధికారులు పలుమార్లు సందర్శించి, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడంతో కొందరు నివాసముంటున్నారు.
243 ఇండ్లు కేటాయించగా, వసతులు లేక ఇప్పటివరకు 30లోపు లబ్ధిదారులే అక్కడ ఉంటున్నారు. ఇండ్లలో ధ్వంసమైన విద్యుత్ పరికరాలను లబ్ధిదారులే సరిచేసుకుంటున్నారు. కాగా, వసతుల కల్పనను పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని, అరకొర వసతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.